డిల్లీ జె.ఎన్.టి.యు. విద్యార్ధి కన్నయ కుమార్ మరికొందరు విద్యార్ధులు కలిసి యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన ఒక సభలో పాకిస్తాన్ అనుకూల, దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లు ఆరోపిస్తూ డిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసారు. ఎఫ్.ఐ.ఆర్.లో కూడా అదే పేర్కొన్నారు. యూనివర్సిటీలో జరిగిన ఆ కార్యక్రమం గురించి జాతీయ దర్యాప్తు బృందం చేత దర్యాప్తు చేయించి, అతనిపై దేశ ద్రోహం నేరం క్రింద కేసు పెట్టాలనుకొన్నారు. కానీ సుప్రీం కోర్టు ఆ ఆలోచనలను తప్పు పట్టడంతో వెనక్కి తగ్గవలసి వచ్చింది. యూనివర్సిటీ యాజమాన్యం ఇచ్చిన నివేదిక ఆధారంగా పోలీసులు ఒక నివేదిక తయారు చేసి డిల్లీ పోలీస్ కమీషనర్ కి పంపించారు.
అందులో కూడా కన్నయ కుమార్ కి వ్యతిరేకంగా అవే ఆరోపణలు చేసారు కానీ తాము స్వయంగా ఎఫ్.ఐ.ఆర్.లో పేర్కొన్న ఏ ఒక్క ఆరోపణను రుజువు చేసే సాక్ష్యాధారాలను కానీ, ప్రత్యక్ష సాక్షుల పేర్లను గానీ చూపించలేకపోయారు. ఎందుకంటే ఆ ఎఫ్.ఐ.ఆర్. ఒక టీవీ చానల్ లో వచ్చిన న్యూస్ క్లిప్పింగ్ ఆధారంగా నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే యూనివర్సిటీ అధికారులు అనుమతి ఇవ్వన్నప్పటికీ కన్నయ్య కుమార్ అతని స్నేహితులు కలిసి యూనివర్సిటీ ప్రాంగణంలో అఫ్జల్ గురు సంస్మరణ సభను నిర్వహించారని తమ నివేదికలో పేర్కొన్నారు. ఆ విషయం కూడా యూనివర్సిటీ అధికారులు తమకు అందజేసిన నివేదిక ద్వారానే తెలుసుకొన్నాము తప్ప తాము స్వయంగా యూనివర్సిటీలోనికి వెళ్లి విచారణ చేయలేదనే సంగతిని డిల్లీ పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు.
తమ నివేదికలో ఉమర్ ఖాలిద్, అనిర్బన్ అనే ఇద్దరు విద్యార్ధులు ఆ సంస్మరణ సభను నిర్వహించినట్లు పేర్కొన్నారు. కానీ వారిద్దరూ కూడా ఆ సభలో దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లు సాక్ష్యాధారాలను చూపలేకపోయారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి అరెస్టులు చేయడం మొదలుపెట్టిన తరువాత వారివురితో సహా మరో ముగ్గురు విద్యార్ధులు పారిపోయారు. వాళ్ళందరూ ఆదివారం రాత్రి మళ్ళీ యూనివర్సిటీకి తిరిగివచ్చేరు. కానీ పోలీసులు వారిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. వారంతట వారు అరెస్ట్ అవుతారని ఎదురుచూస్తున్నామని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న డిల్లీ సౌత్ డిసిపి ప్రేమ నాథ్ చెప్పారు. కానీ తమకు అటువంటి ఆలోచన లేదని ఆ ఐదుగురు విద్యార్ధులు తేల్చి చెప్పారు.
త్వరలో ప్రేమ నాథ్ తన నివేదికను సమర్పిస్తే యూనివర్సిటీలోకి పోలీసులను పంపించి దర్యాప్తు చేయించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకొంటామని డిల్లీ పోలీస్ కమీషనర్ బి.ఎస్. బస్సి తెలిపారు. కన్నయ్య కుమార్ తదితరులను దేశద్రోహులుగా చిత్రీకరించడానికి మొదట ప్రయత్నించిన డిల్లీ పోలీసులు, అతనిని అరెస్ట్ ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా విద్యార్ధులు, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా నిరసనలు తెలియజేస్తుండటంతో పునరాలోచనలో పడినట్లున్నారు. వారు తయారు చేసిన నివేదిక దానికి అద్దం పడుతోంది. ఈ తప్పును వారు ఏవిధంగా సరిదిద్దుకొంటారో తెలియదు కానీ డిల్లీ పోలీసులు, అందుకోసం వారికి ఆదేశాలు జారీ చేసిన ఉన్నతాధికారులు ఈ కేసు నుండి గౌరవప్రదంగా బయటపడగలిగితే అదే గొప్పనుకోవచ్చును.