డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను గంటల తరబడి విచారించడంపై హల్చల్ మీడియాకు అక్కరకు వచ్చింది గాని చెప్పుకోదగిన ఆధారాలేం దొరకలేదట. ఇది బాధ్యత గల ఒక మాజీ పోలీసు అధికారి చెప్పిన మాట. నేరారోపణకూ నిరూపణకు మధ్య ఆధారాలు ముఖ్యపాత్ర వహిస్తాయని అవి లేకపోతే దర్యాప్తు బృందాలు చేయగలిగింది లేదని ఆయన స్పష్టం చేశారు. రక్త పరీక్షలు, తలవెంట్రుకల వంటివి కూడా అన్ని కేసుల్లోనూ ఒకే విధమైన ఫలితాలివ్వవని, కొన్ని రకాల మత్తుపదార్థాలు వాడితే దీర్ఘకాలం ప్రభావం వుండదని కూడా చెప్పారు. పైగా రాజకీయంగా ఈ కేసులో ఇక సంచలనాల పర్వం ముగిసినట్టేనని నేను అనడంతో ఆయన ఏకీభవించారు. అసలు దర్యాప్తు దగ్గర బుధవారానికి గురువారానికి మీడియా సందడిలో చాలా తేడా వచ్చింది. ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన రివ్యూ వాస్తవానికి ఒక రీవ్యూ లాటిదేనని చెప్పాలి. తర్వాత కొత్తగా బయిటకు వచ్చిన విషయం ఒక్కటి కూడా లేదు. ఈ విషయంలో హడావుడి ఎక్కువగా చేస్తున్నారని మీడియాపై విమర్శలు చేస్తున్నారు దాంట్లో నిజం కూడా కొంత వుంది. అయితే మామూలు రోజుల్లో ప్రచార కెరటాలపై తేలియాడే టాలివుడ్ ప్రముఖులు కథ అడ్డం తిరిగినప్పుడు కూడా వ్యతిరేక ప్రచారం అందులో సగమైనా వుంటుందని వూహించాలి కదా.. పైగా సిట్ అధికారులు కోరుకోకపోతే ఇంత హడావుడి వుండదు. హై ప్రొఫైల్ కేసులు చేసేప్పుడు వారు కూడా ప్రచారం కోరుకుంటారు. ప్రభుత్వాధినేతలు కూడా పరిస్థితి చేయిదాటిపోకుండా చూసుకుంటూనే ఏదో జరిగిందన్న భావన కలిగించడానికి ప్రాధాన్యత నిస్తారు. ఇవన్నీ ఎలా వున్నా బలమైన ఆధారాలు దొరికితే కదా.. జరిగిన దానికి సార్థకత! చూస్తుంటే కథ యాంటీ క్లైమాక్స్‌గా ముగిసేట్టు వుంది.