హైదరాబాద్ నుంచి ఏపీకి లక్షల మంది జనం తరలి వచ్చారు. వారు ఎవరికి ఓటేస్తారన్న సంగతి తర్వాత తాము ఎక్కడ ఉన్నా తమ రాష్ట్ర భవిష్యత్ లో తమ వాటా ఉండాలన్నా ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఏపీకి వస్తున్నారు. ఈ డిమాండ్ ఊహించిందే. అందుకే తెలంగాణ ఆర్టీసీ కనీసం ఐదువందల ప్రత్యేక బస్సుల్ని పెట్టింది. కానీ ఏపీఆర్టీసీ మాత్రం పూర్తిగా వదిలేసింది. ప్రత్యేక బస్సుల ప్రస్తావన తీసుకు రాలేదు.
హైదరాబాద్ లో ప్రతి బస్సు బోర్డింగ్ పాయింట్ వద్ద వేల మంది కనిపించారు. వారందరూ బస్సులు దొరకలేదని వెనక్కి పోరు. దొరికినదాన్ని పట్టుకుని వచ్చేస్తారు. అయితే వారికి ఏపీ ఆర్టీసీ ఎందుకు సౌకర్యాలు కల్పించలేదన్నది ఇక్కడ పాయింట్. ప్రజల అవసరాలకు తగ్గట్లుగా బస్సుల్ని ఏర్పాటు చేయడం ఆర్టీసీ చేయాల్సిన పని . దసరా, సంక్రాంతి వంటి సందర్భాల్లో వేల బస్సులు పెడతారు. పెద్ద ఎత్తున జనం వస్తారు. కానీ ఈ సారి ఆ పని కూడా చేయడం లేదు.
వైసీపీ సిద్దం సభలకు.. వేల బస్సులు కేటాయిస్తారు. ఎంత మొత్తం చెల్లిస్తారో .. రెంట్ ఎంతో ఎవరికీ తెలియదు. కానీ ఇస్తారు. డబ్బులు వచ్చే విషయంలో మాత్రం లైట్ తీసుకుంటున్నారు. అటు నుంచి వచ్చే ఓటర్లు వైసీపీకి ఖచ్చితంగా ఓటు వేయరని ఎందుకు అనుకుంటున్నారో మరి !