మెగాస్టార్ చిరంజీవి సోదరి విజయ దుర్గ చిన్న కుమారుడు పంజా వైష్ణవ తేజ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న సినిమా సోమవారం ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప మెగా కుటుంబంలో హీరోలందరూ హాజరవుతారని ముందుగా తెలిపారు. అయితే… రామ్ చరణ్ మాత్రం రాలేదు. చిరంజీవి, అల్లు అరవింద్, నాగబాబు, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, మెగాస్టార్ తల్లి అంజనాదేవి వచ్చారు. ఒక్క చిరంజీవి మినహా ప్రారంభోత్సవానికి వచ్చిన మెగా కుటుంబ సభ్యులు మాట్లాడకపోవడం చర్చనీయాంశమైంది. అలాగే, రామ్ చరణ్ గైర్హాజరు కూడా! రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ సెకండ్ షెడ్యూల్ సోమవారం ప్రారంభం కావడం వల్ల వైష్ణవ తేజ్ సినిమా ప్రారంభోత్సవానికి రామ్ చరణ్ రాలేకపోయారని సమాచారం. రాకపోతే రాకపోయారు కనీసం సోషల్ మీడియాలో అయినా శుభాకాంక్షలు తెలపకపోవడం ఏమిటని కొందరు విస్మయం వ్యక్తం చేశారు. అక్కినేని అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను ట్రైలర్ బావుందంటూ… ఫేస్ బుక్ లో రామ్ చరణ్ ఒక పోస్ట్ చేశారు. పనిలో పనిగా వైష్ణవ తేజ్ సినిమా గురించి ఒక పోస్ట్ పెడితే సరిపోయేది. కానీ అలా చేయలేదు. ఇది కొందరు అభిమానుల్లో చర్చకు దారితీసింది. అసలు విషయం ఏంటంటే… ఈ సినిమా పట్టాలెక్కడానికి ప్రధాన కారణం రామ్ చరణ్. తన ‘రంగస్థలం’ సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు చెప్పిన కథ నచ్చడంతో దాన్ని తండ్రి చిరంజీవి దగ్గరకు తీసుకు వెళ్ళింది రామ్ చరణే.