స్థానిక ఎన్నికలలో వైసీపీ ఎమ్మెల్యేలు,ఎంపీలకు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గట్టి షాక్ ఇచ్చారు. ప్రజాప్రతినిధులెవరూ.. కుటుంబసభ్యులను స్థానిక ఎన్నికలలో నిలపవద్దని ఆదేశించారు. అలా నిలబడితే.. బీఫామ్స్ ఇవ్వవొద్దని రీజనల్ కోఆర్డినేటర్లకు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు.. స్థానిక సంస్థల పదవులపై దృష్టి పెట్టి పెద్ద ఎత్తున తమ బంధుగణాన్ని నిలబెట్టేందుకు సన్నాహాలు చేచేసుకున్నారు. కొంత మంది తమకు ఎంత మంది కుమారులంటే..అందర్నీ తమ నియోజకవర్గ పరిధిలోని.. జడ్పీటీసీలుగానో.. కార్పొరేటర్లగానో నిలబెట్టేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకే బాధ్యత ఇవ్వడంతో అందరూ.. ఇదే చాన్స్ అనుకున్నారు.
కానీ .. పార్టీలోని ఇతర నేతల్ని పట్టించుకోకుండా.. కుటుంబసభ్యులకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఫిర్యాదులు విపరీతంగా రావడంతో.. చివరి క్షణంలో స్పందించింది. ఎమ్మెల్యేలు, ఎంపీల కుటుంబసభ్యులను బరి నుంచి తప్పించాలని స్పష్టం చేసింది. ఇదే నిబంధన కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లోనూ అమలు చేయనున్నారు. అయితే.. సీనియర్ నేతలు.. తమ బంధువులను రంగంలోకి దించినట్లుగా ప్రచారం జరుగుతోంది.
బొత్స సత్యనారాయణ .. తన మేనల్లుడు మజ్జి శ్రీనును విజయనగరం జడ్పీ చైర్మన్ చేయాలనుకుంటున్నారు. ఆయనను బరిలో నిలబెట్టారు. అలా మరికొంత మంది నేతలు బంధువుల్ని నిలబెట్టినట్లుగా తెలుస్తోంది. వీరందరిపై జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. తమకో రూల్… ఇతర నేతలకో రూల్ ఎలా.. అని.. ఎమ్మెల్యేలు అనేక మంది.. మథనపడే పరిస్థితి కనిపిస్తోంది.