లోక్ సభ ఎన్నికల్లో దేశం ముందు ఫెడరల్ ఫ్రంట్ అజెండా పెడతామన్నారు కేసీఆర్. భావ సారూప్యత కలిగిన పార్టీలన్నీ ఒకటౌతాయనీ, అందరూ కలిసి అజెండా తయారు చేస్తామనీ, దాని ప్రాతిపదికనే ఎన్నికలకు వెళ్తామని ఆ మధ్య కేసీఆర్ చెప్పారు. అదే పని మీద కొన్ని రాష్ట్రాలు తిరిగారు, చివరికి తత్వం బోధపడి… ఎన్నికల ఫలితాలు వస్తే తప్ప ఫెడరల్ ఫ్రంట్ కి రూపురేఖలు ఏర్పడే అవకాశం లేదనేది స్పష్టమైంది! అయితే, లోక్ సభ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన కేసీఆర్… ఇప్పుడు మరోసారి ఫెడరల్ ఫ్రంట్ గురించి ప్రస్థావిస్తున్నారు. దాదాపు 150 మందిని జమచేశా అంటున్నారు. ఇతర రాష్ట్రాల సంగతి పక్కనపెడితే… కనీసం సొంత రాష్ట్రమైన తెలంగాణలోనైనా ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాల ప్రాతిపదికనే లోక్ సభ ఎన్నికలకు కేసీఆర్ వెళ్తున్నారా..? దేశ ప్రయోజనాల దృక్కోణంలోనే ఫ్రెంట్ ఆవశ్యకతను తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చెప్తున్నారా..? అంటే, లేదనేదే సమాధానం.
తెలంగాణ అభివృద్ధి మోడల్ దేశానికి అవసరమని కేసీఆర్ అంటుంటారు. అలాంప్పుడు, కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ అజెండానే ఇప్పుడు సొంత రాష్ట్రంలో ప్రచారం చెయ్యాలి కదా! అసెంబ్లీ ఎన్నికలూ అయిపోయాయి కాబట్టి… పూర్తిస్థాయి జాతీయ దృక్పథంతో ఈ ఎన్నికల్ని కేసీఆర్ ఫేస్ చెయ్యాలి. ఫెడరల్ ఫ్రంట్ నమూనాని వివరించి, ఫలానా విధంగా తాను దేశాన్ని అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నాననీ… ఆ తరహా మేనిఫెస్టోని తాను తయారు చేశానని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయడం లేదు. జాతీయ స్థాయిలో ఇతర పార్టీలతో ఎలాగూ కామన్ అజెండా కుదరలేదు. కేసీఆర్ చెప్పిన ప్రజల మేనిఫెస్టో సాధ్యం కాలేదు. అదేదో ఇప్పుడే తయారు చేసి, రాష్ట్రస్థాయిలోనైనా ప్రజలకు వివరించి, దానికి ఆమోదం పొందే ప్రయత్నం కేసీఆర్ చెయ్యొచ్చు. తద్వారా జాతీయ రాజకీయాలకు కేసీఆర్ ఎందుకు సంసిద్ధమౌతున్నారనేది దేశానికి వివరించొచ్చు.
కేంద్రంలో తెలంగాణ పెత్తనం కావాలి, కేంద్రం మెడలు వంచాలి, కేంద్రమే దిగొచ్చి తెలంగాణకు నిధులివ్వాలి, ఢిల్లీలో తెరాస చక్రం తిప్పాలి… ఇవే లక్ష్యాలతో తెరాస ఎంపీ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రజలను కేసీఆర్ కోరుతున్నారు. ఈ ప్రచారంలో జాతీయ స్థాయి దృక్పథం ఎక్కడుంది..? దేశానికి కేసీఆర్ ఆవశ్యకతను వివరించే కోణం ఎక్కడుంది..? దేశం మొత్తాన్ని ఒక యూనిట్ గా చూస్తూ, రెండు జాతీయ పార్టీలూ చేయని అభివృద్ధి నమూనాను కేసీఆర్ ఎక్కడ చూపుతున్నట్టు..? తాను జాతీయ రాజకీయాలకు వెళ్తానంటున్నది తెలంగాణ ప్రయోజనాల కోసమే తప్ప, దీన్లో జాతీయ దృక్పథం కనిపించడం లేదు. సొంత రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడటం తప్పు అని ఎవరూ అనరు. కాకపోతే, దేశానికి తన అవసరం ఉందని చెప్పుకుంటున్నప్పుడు… దేశం కూడా ఆయన అవసరాన్ని ఫీల్ అవ్వాలి కదా! మొత్తానికి, ఫెడరల్ ఫ్రంట్ కేసీఆర్ అవసరంగా కనిపిస్తోందే తప్ప, దేశానికి అవసరంగా.. కనీసం తెలంగాణ ప్రజలకైనా కనిపించాలి కదా!