నిజమే! టిఆర్ఎస్లో గాని వారి ప్రభుత్వ వ్యవస్థలో గాని పదవులు నిర్వహిస్తున్న నాయకులు ఎవరిని కదిలించినా ఇదే మాట చెబుతున్నారు. నాలాటి వాళ్లం అడక్కపోయినా ఆవేదనతో చెబుతున్నారు. మమ్ములను పట్టించుకునే పరిస్థితి లేదు. నెలల తరబడి ముఖ్యమంత్రి దర్శనం దొరకదు. మా కన్నా పెద్దవాళ్లదీ అదే పరిస్థితి అని కొంత వూరట చెందాల్సిందే. ఇంతా చేసి దర్శనం దొరికినా మా మాట చెప్పుకునే వీలు వుండదు. కొలువు కూటమిలో రెండు గంటల పాటు క్లాసు చెప్పినట్టు ఏవేవో అంశాలపై అనర్గళంగా చెబుతుంటూ మారు మాట్లాడకుండా విని రావాల్సిందే. మేము చెప్పాలనుకున్నది మాలోనే మిగిలిపోతుంటుంది. ఏమైనా అందామంటే ప్రభుత్వమే బద్నామ్ అవుతుంది. పైగా మరెవరూ చెప్పంది మేమే చెబితే మాపైన కోపం రావచ్చు. ఏం చేస్తాం అని నిట్టూర్చారు కనీసం ముగ్గురు నేతలు ఇటీవల(విడివిడిగా) కెసిఆర్ఫైనే గాక కెటిఆర్ గురించి కూడా ఇటీవల ఇలాటి కథలు వినిపిస్తుంటే ఒకింత ఆశ్చర్యం కలుగుతున్నది. ఎవరూ ఎవరిని పట్టించుకోవడం లేదన్నది టిఆర్ఎస్లో మార్మోగుతున్న మాట.
ఇది ఇలా వుంటే ఆంధ్రప్రదేశ్‌లో మరో సమస్య. అక్కడ ముఖ్యమంత్రి అధికారులను సమీక్షలు సందేశాల పేరిట గంటల తరబడి కూచోబెట్టి బోధిస్తున్నారు. వారు తమ పరిశీలనాంశాలు చెప్పే అవకాశం వుండదు. ఏకపక్ష బోధనే. అది కూడా ఒక రోజు కాదు,ఒక విషయం కాదు. నిరంతర నిర్విరామ తతంగమే. వినీ వినీ విసుగు రావడం అటుంచి చేయవలసిన పనులు కూడా చేయలేకపోతున్నామని ఐఎఎస్‌లు అవేదన చెందుతున్నారు. పరిస్థితి ఎంత వరకూ వచ్చిందంటే ప్రమోషన్ మీద కలెక్టర్లుగా వెళ్లడానికి కూడా వెనుకాడుతున్నారట. ఇవన్నీ అతిశయోక్తులు కాదు. అసలు సమస్యలో కొంత భాగం మాత్రమే.
మరి ఈ బాధితులను ఎవరు ఆదుకోవాలో మరి!