ప్రతి ఏడాది జనవరిలో అమ్మఒడి డబ్బులిస్తామని.. ఓ ఏడాది ఎగ్గొట్టడానికి జూన్ కు మార్చారు. జూన్ నెలాఖరు రోజు బటన్ నొక్కి జూలైలో పది రోజుల పాటుపడుతూనే ఉంటాయని .. రూ. కోట్లు పెట్టి ఏర్పాటు చేసిన బహిరంగసభలో అంతకు మించి ఖర్చు చేసి ఇచ్చిన ప్రకటనల్లో చెప్పుకున్నారు. తీరా చూస్తే… నెలలో సగం రోజులు అయినా సగం మందికి అమ్మఒడి పడలేదు. పడుతుందో లేదో తెలియదన్నట్లుగా పరిస్థితి మారింది.
ఇప్పటికి నలభై శాతం మందికి అమ్మఒడి డబ్బులు జమ కాలేదు. ఇంకా రూ.రెండు వేల కోట్ల వరకూ జమ కావాల్సి ఉంది. ప్రభుత్వం వద్ద డబ్బులు లేక కాదు.. ప్రతీ వారం.. రెండు, మూడు వేల కోట్ల అప్పు తెస్తోంది . ఎప్పుడూ ఓడీలోనే ఉంటోంది. మరి ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నారో తెలియదు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని బడా కాంట్రాక్టర్లకు కట్టుకుంటూ పోతున్నారేమో కానీ.. పథకాలకు ప్రయారిటీ తగ్గిస్తున్నారు. బటన్లు నొక్కి డబ్బులు ఇవ్వకపోతే… జనం జగన్ పని అయిపోయిందనుకుంటారన్న ఆలోచన కూడా చేయడం లేదు.
చేయగలిగినన్ని అప్పులు చేశారు. పెట్టగలిగినన్ని ఆస్తులు తాకట్టుపెట్టారు. ఇంకా వినూత్న పద్దతిలో మద్యం బాండ్లనీ.. అవనీ.. ఇవన్నీ.. కొత్తగా ఉద్యోగుల సొమ్మునే అప్పులుగా తెచ్చేందుకు రెడీ అవుతున్నారు. లెక్కలేనన్ని గ్యారంటీలు ఇస్తున్నారు. ఇవన్నీఇప్పుడు బ టన్లు నొక్కారని.. తమ ఖాతాల్లో పడ్డాయని అనుకుని సంబరపడిన వారి ఖాతా నుంచే చెల్లించాల్సి ఉంది. కాకపోతే… పన్నుల రూపంలో వసూలు చేస్తారు. ఇప్పటికే వసూలు ప్రారంభమయింది కూడా.