విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన మేజర్ పోర్టు ఏపీ సర్కార్ అనాలోచిత నిర్ణయం వల్ల చిక్కుల్లో పడింది. విభజన చట్టం లో పేర్కొన్న దుగరాజ పట్నం పోర్టుకు బదలుగా రామాయపట్నం మేజర్ పోర్ట్ కు నిధులు కావాలని మొదట కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఆ తర్వాత ఏ కారణమో తెలియద ుకానీ.. గత ఏడాది ఫిబ్రవరి 20 న రామాయపట్నం మేజర్ పోర్ట్ ను నాన్ మేజర్ పోర్ట్ గా మార్చుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇదే చాన్స్ అనుకుని కేంద్రం అసలు పోర్టు హామీని నెరవేర్చడానికి కుదరదని తేల్చి చెప్పేసింది. రామాయపట్నం నాన్ మేజర్ పోర్ట్ కు నిధులు మంజూరు చేయడం సాధ్యం కాదని.. కేంద్రం పార్లమెంట్లో తేలిపింది.
ఎందుకంటే.. మేజర్ పోర్ట్ లకు మాత్రమే కేంద్రం నిధులు ఇస్తుందని కేంద్ర మంత్రి లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేశారు. ఒక వేళ నాన్ మేజర్ పోర్టు అయిన రామాయపట్నంకు నిధులు ఇవ్వాలంటే.. విభజన చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుందని లేకపోతే… నిధులు ఇవ్వడం సాధ్యం కాదనేది కేంద్రం వాదన. రామాయపట్నం నిధుల అంశంపై బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ ప్రశ్న వేశారు. అసలు మేజర్ పోర్టు రేంజ్ నుంచి నాన్ మేజర్ పోర్టు రేంజ్‌కు రామాయపట్నాన్ని దిగజార్చడానికి ఏపీ సర్కార్ ఎందుకు నిర్ణయం తీసుకుందో ఎవరికీ అర్థం కాలేదు.
అయితే… అరబిందో సంస్థకు అప్పగించడానికి నాన్ మేజర్ పోర్ట్ స్థాయికి తగ్గించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు కేంద్రం ఒక్క పైసా నిధులు కూడా ఇచ్చే అవకాశం లేదు. గత వారం… ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో.. పోర్టుల్ని ఏపీ ప్రభుత్వమే నిర్మించి… నిర్వహణ కోసం ప్రైవేటుకు అప్పగిస్తామని జగన్ చెప్పారు. ఇప్పుడు… కేంద్రం నిర్మించాల్సిన రామాయపట్నం కూడా ఏపీ సర్కారే నిర్మించి.. అరబిందోకు అప్పగిస్తుందో.. లేకపోతే.. అరబిందో తోనే నిర్మిస్తుందో చూడాలి..!