ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులకు.. గత రెండేళ్ల నుంచి వేల కోట్ల పనులకు జీవోలిచ్చారు. వెళ్లినప్పుడల్లా శంకుస్థాపనలు చేశారు. కానీ.. ఒక్కటంటే ఒక్క పనీ ముందుకు సాగడం లేదు. శంకుస్థాపనలు శిలాఫలకాలకే పరిమితమవుతున్నాయి. తాజాగా వైఎస్ జయంతి సందర్భంగా మరోసారి పులివెందులకు వెళ్తున్నారు. ఈ సారి పులివెందులతో పాటు బద్వేలులోనూ శంకుస్థాపనలు చేస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యే చనిపోవడంతో ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. బహుశా.. ఈకారణంతో ఈ సారి ఆ నియోజకవర్గానికి కూడా ఓ నాలుగు వందల కోట్ల పనులతో కూడిన జీవోలిచ్చి శంకుస్థాపనలు చేస్తున్నారు. కానీ పనులు జరుగుతాయని ఎవరూ ఆశలు పెట్టుకోవడం లేదు.
పులివెందులకు నిధుల కేటాయింపు జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గానికి వెళ్లే ప్రతీసారి ఉంటుంది. ఆయన వైఎస్ జయంతి, వర్థంతి, క్రిస్మస్ పండుగలకు ఎక్కువగా వెళ్తూంటారు. ఈ సందర్భాలలో జీవోలు వెల్లువెత్తుతూంటాయి. ఓ సారి దాదాపుగా 30 వరకూ జీవోలు విడుదల చేశారు. ఆ పనుల మొత్తం విలువ పదమూడు వందల కోట్లు ఉంటుంది. ఆ తర్వాత జనవరిలో పులివెందుల ప్రాంతంలో తాగునీటి సరఫరాకు రూ. 480 కోట్లు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత పులివెందుల నియోజకవర్గంపై ప్రత్యేకంగా సమీక్ష చేసిన జగన్.. కనీసం రూ. 300 కోట్లకుపైగా విలువైన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రి, వేంపల్లి సీహెచ్‌సీకి రూ.30 కోట్లతో మౌలిక సౌకర్యాలు .. పులివెందుల మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎస్టీపీకి రూ.50 కోట్లు ఇవి మాత్రమే కాదు… పులివెందులలో మెట్రో స్థాయిలో మిని శిల్పారామం, ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్, గండి క్షేత్రం, గండికోట, ఒంటిమిట్ట ప్రాంతాలను కలుపుతూ ఒక టూరిజం సర్కూట్ … జాతీయ స్ధాయి ప్రమాణాలతో కూడిన విద్యాసంస్ధ ఏర్పాటు.. అలాగే… భారీ మాల్ మల్టిప్లెక్స్‌లను పులివెందులలో నిర్మించాలని సీఎం ఆదేశించారు.
ఇవన్నీ గత రెండేళ్ల కాలంలో.. జగన్ ఆదేశించిన అభివృద్ధి కార్యక్రమాలు. ఒక్క పులివెందుల కోసమే. కానీ నిధుల కేటాయింపు మాత్రం లేదు. అన్నీ జీవోలకే పరిమితం. ముఖ్యమంత్రిగా ఉన్న సొంత నియోజకవర్గానికి జీవోలు మాత్రమే ఇస్తున్నారని నిధులు ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి. రెండేళ్ల కిందట.. పులివెందులకు బస్ స్టేషన్ లేదని.. ప్రపంచస్థాయి బస్ స్టాండ్ నిర్మిస్తామని.. విమానం ఆకారంలో ఉన్న గ్రాఫిక్‌ను మీడియాకు వదిలారు. ఆ నిర్మాణంలో ఇంత వరకూ కదలిక రాలేదు. రెండేళ్లలో ఓ బస్ స్టాండ్ కట్టలేని సీఎం.. ఇంకేం చేస్తారని.. విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. ప్రజలు కూడా అభివృద్ధి గురించి పట్టించుకోవడం మానేశారు.