ఈరోజుల్లో హిట్ అనే మాట వినడమే గగనం. సూపర్ హిట్ కొడితే… అబ్బో అనాల్సిందే. ఇక ఆ దర్శకుడి ఆఫీసు ఖాళీ ఉండదు. ఫోన్ రింగవుతూనే ఉంటుంది. నిర్మాతలు క్యూలు కట్టేస్తుంటారు.. కర్చీఫ్‌లు వేసేస్తుంటారు. కానీ.. సతీష్ వేగ్నేశ విషయంలో ఇవేం జరగం లేదు. ఈ సంక్రాంతికి శతమానం భవతి తో సూపర్ హిట్ ఇచ్చాడు సతీష్. రెండు పెద్ద సినిమాలతో పోటీ పడి విడుదలైన శతమానం భవతి.. బాక్సాఫీసు దగ్గర మంచి రిజల్ట్ రాబట్టింది. ఫైనల్ రన్ లో ఈ సినిమా రూ.25 కోట్ల మైలు రాయిని అందుకొంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రచయితగా పేరు తెచ్చుకొన్న సతీష్‌కి దర్శకుడిగా ఇది మేలిమి మలుపే. అయితే… సతీష్ తదుపరి సినిమా ఏమిటి? అనేది ఇంకా ప్రశ్నార్థంగానే మారింది. అడ్వాన్సులు గానీ, హీరోల దగ్గర మాట గానీ తీసుకోలేకపోయాడు సతీష్. ‘సినిమా బాగుంది’ అన్నారు గానీ, దర్శకుడి గురించి కూడా పెద్దగా మాట్లాడుకోలేదు. అది… సతీష్‌కి కాస్త ఇబ్బంది కలిగించే అంశమే.
నిజానికి శతమానం భవతి తరవాత నాగార్జున, నాగచైతన్యలతో ఓ మల్టీస్టారర్ చేయాలని భావించాడు సతీష్. శతమానం భవతి సెట్స్‌పై ఉండగానే.. ఓ కథని దిల్ రాజుకి వినిపించాడు. ‘ఈ కథ నాగ్, చైతూలకే బాగుంటుంది’ అని ఆయనా ఫిక్సయిపోయారు. ఇదే విషయాన్ని మీడియాకూ లీక్ చేశారు. దాంతో ఈ ప్రాజెక్ట్ నాగ్, చైతూల దగ్గరకు వెళ్లకుండానే సతీష్ ఓ సినిమా చేస్తున్నాడని, అందులో నాగార్జున, చైతూలు నటించడం ఖాయమన్నట్టు వార్తలొచ్చాయి. వీటిపై నాగ్ కాస్త సీరియస్ అయినట్టు టాక్. దాంతో సతీష్ కథ రివర్స్ అయ్యింది. అదే మీడియాకు లీక్ అవ్వకముందే సతీష్ నాగ్ని కలిసుంటే.. పరిస్థితి మరోలా ఉండేది. ఈపాటికి సతీష్ ఖాతాలో ఓ సినిమా చేరేది. కేవలం దిల్‌రాజు అత్యుత్సాహం వల్ల ఆ ఛాన్స్ కోల్పోయాడు సతీష్. మిగిలిన హీరోలంతా వాళ్ల వాళ్ల ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల, మాస్ కథల బాట పట్టడం వల్ల సతీష్‌ని లైట్ తీసుకొన్నారు. అయితే దిల్ రాజు మాత్రం ‘నీ నెక్ట్స్ సినిమా కూడా మన బ్యానర్లోనే. హీరోని కూడా నేనే వెదికి పెడతా’ అంటూ…. ఆ బాధ్యతని తాను తీసుకొన్నాడట. సో.. సతీష్ రిలాక్స్ అయిపోవచ్చు. దిల్‌రాజు లాంటి నిర్మాత ఉంటే ఇదే అడ్వాంటేజ్. మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టి కథపై దృష్టి పెట్టొచ్చు. సతీష్ కి ఇప్పుడు ఆ అవకాశం ఉంది. తన తదుపరి సినిమా కాస్త ఆలస్యమైనా.. మంచి ప్రాజెక్టే సెట్ కావొచ్చు. సో… సతీష్ మళ్లీ లక్కీనే.