గోపీచంద్ అసలే ఫ్లాపుల్లో ఉన్నాడు. మరో దెబ్బ తగిలితే… కెరీర్‌కే ప్రమాదం. ఇలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి..?? ఎంతగా ఆచి తూచి అడుగులేయాలి? కానీ… గోపీచంద్ మాత్రం ఈ జాగ్రత్తలేం తీసుకోలేనట్టే కనిపిస్తోంది. ఆయన తాజా చిత్రం ‘పంతం’ ఫస్ట్ లుక్ నిన్న బయటకు వచ్చింది. ఆ లుక్కు మామూలుగానే ఉంది. గోపీచంద్ ముందున్న పెన్సిళ్లూ, స్కెచ్చులూ చూస్తే.. ఇదో మైండ్ గేమ్ సినిమా ఏమో అనిపిస్తోంది. అంతకు మించిన ఆకర్షణేం లేదు. గోపీచంద్ సినిమా ఫస్ట్ లుక్ వస్తోంది.. వచ్చింది.. అన్న హడావుడేం కనిపించలేదు. నిజానికి ఉగాదికి ఫస్ట్ లుక్ తీసుకొద్దామనుకున్నారు. కానీ.. ఆ రోజున ఫస్ట్ లుక్ల హడావుడి చాలానే ఉంటుంది. ఆ గుంపులో కొట్టుకుపోతుందేమో అన్న అనుమానంతో కాస్త ఆలస్యంగా రంగంలోకి దింపారు.
అయినా సరే.. ఫస్ట్ లుక్ ఈ సినిమాకి హైప్ తీసుకురాలేకపోయింది. గోపీచంద్ గత చిత్రాలు ఆక్సిజన్, గౌతమ్ నందా… సినిమాలు ఫ్లాప్ అయినా… వాటి కొచ్చిన పబ్లిసిటీ వల్లే… ఆయా చిత్రాలకు కనీసం ఓపెనింగ్స్ దక్కాయి. ‘పంతం’ అనే సినిమా ఒకటి తయారవుతోందని, అది గోపీచంద్ 25వ సినిమా అని ఎంతమందికి చేరిందో అర్థం కావడం లేదు. ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఇంకాస్త చురుగ్గా వ్యవహరించాలి తప్ప… ఉదాశీనంగా ఉండకూడదు. గోపీచంద్ ఆ తప్పే చేస్తున్నాడిప్పుడు. సినిమాకి ఇంకా టైమ్ ఉంది కదా అనుకోవడానికి వీల్లేదు. సినిమా ఆల్రెడీ పూర్తి కావొచ్చింది. ఈ వేసవిలోనే విడుదల చేసేస్తారు. మరి… గోపీచంద్ ఎప్పుడు హుషారు తెచ్చుకుంటాడో్ ఏంటో??