ఇప్పుడు సందడంతా బాహుబలి 2దే. సినిమా కబుర్లన్నీ బాహుబలి చుట్టూనే తిరుగుతున్నాయి. బాహుబలి ట్రైలర్ అదిరిపోయిందని, ఆ షాట్ బాగుందని, ఈ రికార్డులు బద్దలవుతున్నాయని.. ఒకటే హంగామా! వీటి మధ్య కాలమరాయుడు 4వ పాట విడుదలైంది. ఏమో.. ఏమో.. ఏమో అంటూ సాగిన ఈ అనూప్ బాణీ.. మెలోడీ టచ్‌తో హాయిగా ఉంది. అయితే.. బాహుబలి 2 ట్రైలర్ కబుర్లలో ఉన్న వాళ్లు ఈ పాటని పట్టించుకొంటారా, లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకూ వచ్చిన టీజర్లు, పాటలు యూ ట్యూబ్‌లో కొత్త రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు బాహుబలి 2 ట్రైలర్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ శలో కాటమరాయుడు పాట ఎంత ప్రభావం చూపిస్తుందన్నది అనుమానమే. ఈనెల 18న కాటమరాయడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతోంది. అదే రోజున థియేటరికల్ ట్రైలర్ విడుదల చేస్తారు. కాటమరాయుడు సత్తా ఏంటన్నది ఆరోజు తెలిసిపోతుంది.
యూ ట్యూబ్‌లో ఇప్పటికే బాహుబలి ట్రైలర్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తొలి 8 గంటల్లో అన్ని భాషల్లో కలిపి కోటికిపైగా హిట్స్ వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. తెలుగు వరకూ తీసుకొన్నా సౌత్ ఇండియన్ రికార్డులన్నీ బద్దలైపోవడం ఖాయం. ఆ తరవాత వచ్చే ట్రైలర్ కాటమరాయుడుదే కాబట్టి… పవన్ ట్రైలర్‌పైనే ఒత్తిడి పడబోతోంది. అయితే.. పవన్ ఫ్యాన్స్ లెక్కేవేరు. వాళ్లంతా పాత రికార్డులన్నీ పవన్ పేర కొత్తగా రాయడానికి ట్రై చేస్తుంటారు. కాబట్టి.. తెలుగు వరకూ బాహుబలి 2 ట్రైలర్ సాధించిన రికార్డులన్నీ.. కాటమరాయుడు ఎగరేసుకుపోవడం ఖాయమంటున్నారు ఫిల్మ్‌నగర్ వర్గాలు. మరి ఏం జరుగుతుందో చూడాలి.