ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ప్రధానమంత్రిని కలిశారు. ఆ వెంటనే ఆర్థికమంత్రినీ కలిశారు. ఇతర మంత్రుల్నీ కలిశారు. లోపల ఏం చర్చించారు.. ఏం సాధించారు… ఏం తేల్చారు అన్న విషయాలు బయటకు తెలియవు. తెలిసినంత వరకూ తెలిశాయి. ఎవరి విశ్లేషణలు వారు చేస్తున్నారు. అయితే సీఎం ఢిల్లీ టూర్లో గతంలో ఉండేతంటి ఉత్సాహం.. కనిపించలేదనేది ఢిల్లీ వర్గాల నుంచి వినపించిన ఎక్కువమాట. గతంలో సీఎం జగన్ ఢిల్లీ వస్తున్నారంటే పెద్ద ఎత్తున రాజకీయ నేతలు.. పారిశ్రామికవేత్తలు వచ్చి కలిసేవారు. ఈ సారి ఆ జోరు తగ్గింది. అదే సమయంలో సీఎం జగన్ కోసం ఢిల్లీలో చేసిన ఏర్పాట్లు కూడా కళ తప్పాయి.
సాధారణంగా ప్రధానమంత్రిని కలవడానికి వెళ్లినప్పుడు సీఎం జగన్ ప్రత్యేకమన ఏర్పాట్లతో వెళ్తారు. మంచి దుశ్శాలువ మాత్రమే కాదు తిరుపతి ప్రసాదంతో పాటు మంచి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా ఇస్తారు. కానీ ఈ ఈ సారి అలాంటివేమీ లేవు. కేవలం ఫ్రేమ్ కట్టించిన ఓ వెంకటేశ్వర స్వామి పటాన్ని మాత్రమే ప్రధానికి బహుకరించారు. ఆ తర్వాత కేంద్రమంత్రులకూ అంతే. మామూలుగా అయితే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి .. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలవడానికి వెళ్లినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఇలాంటి కానుకలు తీసుకెళ్లేవారు. ఈ సారి జగన్ అలాంటివి తీసుకెళ్లలేదు.
గతంలో జగన్ ఢిల్లీకి వస్తున్నారంటే ఓ ప్రత్యేకమైన బృందం వెళ్లేది. కొన్ని కార్యకలాపాలు చక్కబెట్టేవారు. అయితే ఈ సారి అలాంటి బృందం ఏదీ లేనట్లుగా తెలుస్తోంది. మొత్తంగా సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారంటే గతంలో కనిపించే హడావుడిలో ఇప్పుడు సగం కూడా లేదన్న భావన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో తెర వెనుక జరిగిన పరిణామాలు ఏమైనా కారణమా.. లేక ఎన్ని సార్లు విజ్ఞప్తులు చేసినా… ఎలాంటి ప్రయోజనం లేకపోవడం కారణమా అన్నది ముందు ముందు తెలియాల్సి ఉంది.