అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్… ఎప్పటికప్పుడు కనిపించే వార్తల్లో ఇదీ ఒకటీ! ఏదో ఒక అంశంపై సీఎం సీరియస్ కావడం, సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆపై అధికార యంత్రాంగంలో కొంత చురుకుదనం రావడం.. ఇలాంటివి చాలాసార్లు చూశాం. అయితే, అధికారులు ముఖ్యమంత్రికి మాత్రమే స్పందిస్తున్నారా..? ఇతర మంత్రుల మాటల్ని లైట్ తీసుకుంటున్నారా..? అంటే, అవుననే అనిపిస్తోంది. దానికి ఉదాహరణ తాజాగా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విషయంలో చోటు చేసుకున్న ఘటనే. హోం శాఖకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ శంకుస్థాపనకు, ఆ శాఖ మంత్రి రాజప్పకే ఆహ్వానం అందకపోవడంతో ఆయన ఖంగుతిన్నారు. ఆ తరువాత, ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దీంతో రొటీన్ గా చంద్రబాబు అధికారులను మందలించారు. దాంతో అధికారులు కూడా రొటీన్ గానే.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పారు.
అయితే, ముఖ్యమంత్రి ఇలా చెప్పారు కాబట్టి.. ఇక మంత్రులంటే అధికార వర్గాల్లో అనూహ్యమైన గౌరవ మర్యాదలు పెరిగిపోతాయా అంటే… అవునని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే, ఇలాంటి ఘటనలు రొటీన్ అయిపోయాయి కాబట్టి! ఈ మధ్య ఎమ్మెల్యే వంశీ విషయంలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురౌంది. అప్పుడు కూడా అంతా అయిపోయాక.. ఇలాంటివి పునరావృతం కావని అధికారులు చెప్పారు. కానీ, ఇప్పుడు చినరాజప్ప విషయంలో ఇలా జరిగింది. ఇంతకీ లోపం ఎక్కడుంది..? ముఖ్యమంత్రి పదేపదే వారిస్తున్నా అధికారులు బేఖాతరు చేస్తున్నారా..? లేదా, ఆయా శాఖల పట్ల పట్టులేని మంత్రుల విషయంలో అధికారులు అడ్వాంటేజ్ తీసేసుకుంటున్నారా..? అంటే, రెండోదే వాస్తవమని చెప్పాలి..!
కొంతమంది మంత్రులకు శాఖపై సరైన పట్టులేని మాట వాస్తవమే అనే అభిప్రాయమూ ఉంది. సొంత నిర్ణయాలు తీసుకునేంత శక్తి సామర్థ్యాలు కొందరికి లేవని అధికార వర్గాల్లో బాగా ప్రచారంలో ఉంది. దీంతో అన్ని అంశాలపైనా అధికారుల అభిప్రాయాలకే సదరు మంత్రులు ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. దీంతో అధికారులకు అసలుగా మారుతోందట. ఇక్కడ, మంత్రుల తీరులో కూడా కొంత లోపం కనిపిస్తోందన్న మాట వినిపిస్తోంది. తమకు కావాల్సిన పనులు చేసి పెడితే చాలు.. ఇతర అంశాలు ఎలా పోతే మాకేంటి అనే ధోరణి కొంతమందిలో ఉందనే విమర్శా వినిపిస్తోంది. అందుకే, సబ్జెక్ట్ ఉన్న యనమల వంటి కొద్ది మంత్రులు తప్ప, చాలా శాఖల్లో అధికారుల హవా కనసాగుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితి చంద్రబాబుకు తెలియదని ఎలా అనుకుంటాం..! అందుకే, తన దృష్టికి వచ్చిన అంశాలపై ఆయన కూడా ఓసారి ఆగ్రహం వ్యక్తం చేసేసి.. మమ అనిపించేసుకుంటున్నారనీ అనుకోవచ్చు..