కనీసం వారానికోసారైనా ప్రెస్ మీట్ పెడుతూ వార్తల్లో ఉండేవారు ఎర్రబెల్లి దయాకరరావు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న ఎర్రబెల్లి, తెరాసలో చేరిన తరువాత తన దూకుడు తగ్గించుకున్నారు! నిజానికి, తెరాసలో చేరిన కొత్తల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కనే తరచూ కనిపిస్తూ ఉండేవారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండేది. కానీ, ఆ తరువాత రానురానూ ఆయన తెర మీద కనిపించడం లేదు. జిల్లా కేంద్రానికి వచ్చిన ప్రతీసారీ ప్రెస్ మీట్ పెడుతూ ఉండే ఎర్రబెల్లి… ప్రస్తుతం ఆపని కూడా చేయడం లేదు. అంతేకాదు, జిల్లా స్థాయి తెరాస నేతలను కలుపుకుని వెళ్లడానికి కాస్త ఇబ్బంది ఫీల్ అవుతున్నారన్నది తాజా సమాచారం!
దీంతో చేసేది లేక మౌనంగా ఉండిపోవాల్సి వస్తోందన్న అభిప్రాయం ఎర్రబెల్లి అనుచరుల నుంచే వ్యక్తమౌతోంది. ఆయనతో కలిసి వచ్చిన కార్యకర్తలు తీవ్ర గందరగోళానికి గురౌతున్నట్టు సమాచారం. తెలుగుదేశం నుంచి తెరాసలోకి వచ్చిన ఎర్రబెల్లి అనుచరులు కూడా అధికార పార్టీ తీరుతో కాస్త అసంతృప్తిగానే ఉంటున్నారట. పార్టీ సమావేశాల్లో తమకు తగిన ప్రాధాన్యత లభించడం లేదనీ, ఈ పరిస్థితిపై ఎర్రబెల్లి కూడా నోరు విప్పడం లేదని వారు వాపోతున్నట్టు సమాచారం.
పాలకుర్తి నియోజక వర్గంలో నామినేటెడ్ పదవుల విషయమై కూడా ఎర్రబెల్లి మాటకి ప్రాధాన్యత దక్కడం లేదని సమాచారం! ఆయన సూచించినవారిని అధికార పార్టీ పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలోనూ ఎర్రబెల్లి మౌనంగా ఉంటుండటంతో ఆయన అనుచరులు కాస్త గుర్రుగా ఉన్నారట. అయితే, ఇంత జరుగుతున్నా ఎర్రబెల్లి ఎందుకు మౌనంగా ఉంటున్నారంటే… మంత్రి పదవి కోసమే అని చెప్పాలి.
త్వరలోనే తనకు మంత్రి పదవి వస్తుందనీ, ఆ తరువాత రాజకీయంగా తాను ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ ఒకేసారి చెక్ పెట్టే అవకాశం ఉంటుందన్న ధీమాతో ఎర్రబెల్లి ఉన్నారట. పదవి వచ్చే వరకూ మౌనంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్టుంది. అయితే, ఇప్పటికే అవిభక్త వరంగల్ జిల్లా నుంచి కేసీఆర్ కేబినెట్లో మంత్రులు ఉన్నారు. వారికి కాదని.. లేదా, వారిలో ఒకరికి పొగబెట్టి ఎర్రబెల్లికి స్థానం కల్పించే అవకాశం ఉంటుందా..?