ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత చట్టంలో పేర్కొన్న ఒక్కో అంశంపై ఇన్నాళ్లూ నాన్చుతూ వచ్చిన కేంద్రం, ఇప్పుడు ఒక్కోటిగా అసాధ్యమంటూ స్పష్టత ఇస్తోంది! విభజిత ఆంధ్రాకు చట్టప్రకారం రావాల్సిన రైల్వే జోన్ పైగానీ, కడప ఉక్కు కర్మాగారంపైగానీ, ఇతర అంశాలు.. ఇలా అన్నింటిపైనా గడచిన నాలుగేళ్లలో పరిశీలన పరిశీలన అంటూ కాలయాపన చేసి.. ఇప్పుడీ చివరి పార్లమెంటు సమావేశాల దగ్గరకి వచ్చేసరికి… అవి సాధ్యం కావంటూ కేంద్రం చెబుతోంది! రాష్ట్ర విభజన అనంతరం అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాలంటూ చట్టంలో ఉంది. ఆంధ్రాలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలను 225కి, తెలంగాణలో ఉన్న 119 స్థానాలను 153కి పెంచాలని చట్టంలో పేర్కొన్నారు.
ఇదే అంశమై రాజ్యసభలో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై హోంశాఖ సహాయ మంత్రి హంసరాజ్ గంగారం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇప్పట్లో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇంతకీ ఎప్పట్లో సాధ్యమంటే… 2026 తరువాత అనేశారు! అవును… రాజ్యాంగంలోని 170 (3) అధికరణ ప్రకారం 2026 తరువాత సేకరించిన జనాభా లెక్కలు వచ్చిన తరువాతే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచడం సాధ్యమని ప్రభుత్వం తెగేసి చెప్పేసింది. అక్కడితో ఆగినా బాగుండేది… విభజన చట్టంలోని 12వ షెడ్యూల్ లోని అన్ని అంశాలను దాదాపుగా కేంద్రం అమలు చేసేసిందని స్పష్టం చేయడం విశేషం!
గడచిన నాలుగేళ్లుగా… తెలంగాణ, ఆంధ్రాలో అసెంబ్లీ స్థానాలు పెంచాలంటూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ కేంద్రంపై ఒత్తిడి తెస్తూ వచ్చాయి. అయితే, ఇన్నేళ్లలో కేంద్రం నుంచి ఏమాత్రమూ స్పష్టత రాలేదు. ఎన్నికల సంఘం పరిశీలిస్తోందీ, అధ్యయనం జరుగుతోందీ, కేంద్రం ఆలోచిస్తోందీ… ఇలాంటి సమాధానాలు చెబుతూనే ఇన్నాళ్లూ గడిపేశారు. ఒకవేళ 2026 జనాభా లెక్కలొస్తేగానీ అసెంబ్లీ స్థానాలు పెంచలేని పరిస్థితి ఉంటే… ఆ ముచ్చటేదో మూడేళ్ల కిందటే చెప్పెయ్యొచ్చు కదా! నిన్ననే హోదా అసాధ్యమని మరోసారి కేంద్రం చెప్పింది. ఇవాళ్ల అసెంబ్లీ స్థానాల పెంపుపై స్పష్టత. ఇన్నాళ్లూ ఎందుకు ఆగినట్టు..? అంటే… తెలుగు రాష్ట్రాల్లో భాజపాకి అనుకూలమైన పరిస్థితులు ఏవైనా ఏర్పడితే.. ఆ సమయంలో ఇలాంటి అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకుని, పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోవచ్చిన భావించినట్టుంది! కానీ, 2019లో జరగబోయే ఎన్నికల్లో భాజపా పరిస్థితి ఇక్కడ ఎలా ఉంటుందనే స్పష్టమైన అంచనా వచ్చేయడంతో… ఇప్పుడీ అంశాలు అసాధ్యాలంటూ తెగేసి చెప్పేస్తున్నట్టుగా ఉంది.