ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయనే ఆశ చాలా మంది ఆశావహుల్లో ఉంది. జీవితంలో ‘సింగిల్ డే’ అయినా అసెంబ్లీలో కూర్చుని ‘అధ్యక్షా’ అనాలనే కోరిక చాలామంది రాజకీయ జీవుల్లో ఉంటుంది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ సిటింగు ఎమ్మెల్యేలతోనూ, ఓడిపోయిన పార్టీ ఇన్చార్జులతోనూ బిజీగానే ఉంటాయి. మరి కొత్తగా తాము ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యే రేంజి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడం ఒక కష్టం కాగా, ఎమ్మెల్యే కావడం మరో కష్టం అని కసరత్తు చేస్తూ ఉంటారు. అయితే వీరందరికీ త్వరలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే సీట్ల సంఖ్య దాదాపు రెట్టింపుగా పెరుగుతుందనే ఆశ ఇన్నాళ్లూ ఉండేది. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే.. తమకు తప్పకుండా ఎమ్మెల్యే చాన్సు దక్కుతుందని అనుకుంటూ తమ తమ నియోజకవర్గాల్లో కోట్ల కోట్ల రూపాయలను సెలవుచేస్తూ ప్రచారాల్లో మునిగిఉన్న వారు అనేకులు ఉన్నారు.
అయితే ఇలాంటి వారందరి ఆశల మీద కేంద్ర ఎన్నికల సంఘం ఒక్కసారిగా నీళ్లు చిలకరించేసింది. 2026 వరకు ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచడం సాధ్యం కాదంటూ సీఈసీ తేల్చిచెప్పేశారు. ఈ విషయాన్ని సోమవారం నాడు ఆయనను కలిసి మాట్లాడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి మీడియాకు వెల్లడించడం విశేషం.
ఎమ్మెల్యేలు కావాలనే ఆశావహుల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. వైకాపా ఎంపీ ప్రకటనతో వారి ఆశలు సన్నగిల్లినట్లు అయింది. నిజానికి 2019లోగా నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాదని సీఈసీ గతంలో చాలా సార్లు చెప్పింది. అయినా సరే.. ఎవరికి వారు.. ఆలోగా అయిపోతుంది లెమ్మనే ఆశలతో ఊరేగుతున్నారు. తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైకాపా ఎంపీ మేకపాటి, సోమవారం సీఈసీని కలిసి నియోజకవర్గాల్ని పెంచడం గురించి విజ్ఞప్తి చేశారు. 2026 వరకు పెంచడం సాధ్యం కాదని సీఈసీ తనకు తెలియజేశారంటే భేటీ తర్వాత మేకపాటి స్వయంగా మీడియాకు వెల్లడించడం విశేషం. దీంతో 2019 నాటికి కొత్త నియోజకవర్గాలు వస్తాయి.. మనం కూడా బరిలో తొడకొడతాం అని ఆశలు పెంచుకుంటున్న వారి కలల మీద నీళ్లు చిలకరించినట్లే అయింది.