ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ పూర్తిగా ఆగిపోయినట్లుగా కనిపిస్తోంది. గతంలో ప్రతి శుక్రవారం జరిగేది.తర్వాత రోజు వారీ విచారణ అన్నారు. కానీ ఇప్పుడు అసలు విచారణ జరుగుతున్న సూచనలే కనిపించడం లేదు. ప్రజా ప్రతినిధులపై కేసులను ఏడాదిలో పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఆ ప్రకారం రోజువారీ విచారణకు రెడీ అయింది. అయితే తర్వాత ఏం జరిగిందో కానీ పూర్తి స్థాయిలో విచారణ ఆగిపోయింది.ఎందుకు ఆగిపోయిందో సామాన్యులకు అర్థం కావడం లేదు.
ఓ నిందితుడు బెయిల్ మీద పదేళ్లకుపైగా ఉన్నారంటే న్యాయవ్యవస్థ ఎంత నెమ్మదిగా పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చన్న విశ్లేషణలు వస్తున్నాయి. నిజానికి ఇన్ని రోజులు అయినప్పటికీ ఈడీ, సీబీఐ ఇంత వరకూ కేసుల్ని ట్రయల్ వరకూ తీసుకు రాలేదు. కళ్ల ముందు కనిపించే సాక్ష్యాలు ఈ కేసుల్లో ఉన్నాయి. ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా కేటాయించి.. ఆ సొమ్మను తమ ఖాతాల్లో జమ చేసుకున్నది కళ్ల ముందే ఉన్నది. అయినప్పటికీ న్యాయస్థానాలు ఇంక ఏదీ తేల్చలేకపోతున్నాయి. నిందితులు అనేక రకాల పిటిషన్లు వేసి విచారణ ఆలస్యం చేస్తున్నారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.
నేరపూరిత స్వబావం ఉన్న వారు అత్యధిక కాలం బయట ఉంటే జరిగే పరిణామాలు సమాజానికి కీడు చేస్తాయని నిపుణులు చెబుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు కేసుల్లో సాక్ష్యులను ప్రభావితం చేయడం దగ్గర్నుంచి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లోనూ అలాంటివి చాలా ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. కారణం ఏదైనా జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలు జరగకపోవడం.. మొత్తం వ్యవస్థపై ప్రజల్లో అపనమ్మకం ఏర్పడటానికి కారణం అవుతోంది.