ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో టాప్ పొజిషన్లో ఉన్నాయని కేరళ, ఏపీ వంటి రాష్ట్రాలను పొగిడేస్తున్నారు. మా ర్యాంక్ గల్లంతయిందని ఇదంతా కాంగ్రెస్ పుణ్యమేనని కేటీఆర్ ఆరోపించేస్తున్నారు. ఆ ర్యాంకులు ఇప్పటివి కాదు.. బీఆర్ఎస్ హయాంలోనివేనని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. ఈ ర్యాంకులు గొప్పగా ఉన్న సమయంలోనే ఈ ఏడాది వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో ఏ రాష్ట్రానికి ఎంత వచ్చిందో కూడా ఓ లిస్ట్ బయటకు వచ్చింది. కానీ ఈ డూయింగ్ బిజినెస్ రాష్ట్రాలకు .. పెట్టుబడులే రాలేదు.
ఈ ఆర్థిక సంవత్సరంలో దేశానికి వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడుల్లో 52 శాతం మహారాష్ట్రకే వెళ్లాయి. మొత్తంగా 70, 795 కోట్ల రూపాయలు మహారాష్ట్రకు పెట్టుబడులుగా వచ్చాయి. కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఆ రాష్ట్రం టాప్ టెన్ లో లేదు. పెట్టుబడుల సాధనలో రెండో స్థానంలో కర్ణాటకకు రూ. 19,059 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీనికీ డూయింగ్ బిజినెస్‌లో చోటు లేదు. పెట్టుబడుల సాధనలో మూడో స్థానంలో ఢిల్లీ కి కూడా టాప్ టెన్ లో చోటు లేదు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే తెలంగాణకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 9 వేల కోట్ల రూపాయలకుపైగా వచ్చాయి. నాలుగో స్థానంలో నిలిచింది. కానీ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో చోటు లేదు. టాప్ టెన్‌లో చివరిలో ఉన్నరాజస్థాన్కు వచ్చిన పెట్టుబడులు రూ. 311 కోట్లు మాత్రమే. అంటే మిగతా పందొమ్మిది రాష్ట్రాలకు ఆ మాత్రం పెట్టుబడులు కూడా రాలేదని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కేరళ ముందొచ్చినా.. టాప్ టెన్ పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రాల్లో కేరళ లేదు. ఆంధ్రప్రదేశ్ కూడా లేదు. ర్యాంకులకు.. చదువుకు పొంతనలేదన్నట్లుగా.. ర్యాంకులకు పెట్టుబడులకు పెద్దగా సంబంధం ఉండటం లేదు.