కొండను తవ్వి ఎలుకను బయటకు తీశారని ఓ సామెత. ఇక్కడ ఎలుక కూడా రాలేదు. ఏమీ లేదని తేల్చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు శివాజీరాజా, ప్రధాన కార్యదర్శి నరేశ్ మీడియాకు ఎక్కి రచ్చ రచ్చ చేసిన సంగతిని ఎవరూ అంత త్వరగా మరిచిపోరు. ‘మా’ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా చిరంజీవి ముఖ్య అతిథిగా అమెరికాలో నిర్వహించిన కార్యక్రమంలో అవతవకలు చోటు చేసుకున్నాయని ఓ ఇంగ్లిష్ పత్రికలో వార్త వచ్చింది. దానిపై ‘మా’ మీటింగులో చర్చ జరిగింది. తరవాత మీడియా ముందుకొచ్చిన శివాజీరాజా “తప్పు జరిగిందని తేలితే గుండు గీయించుకుంటా” అని చెప్పారు. అదే రోజు సాయంత్రం మీడియా ముందుకొచ్చిన నరేశ్ “తప్పు జరిగి వుండొచ్చు. లేకపోవచ్చు. సినిమా పెద్దలను కలిసి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేయాలని కోరుతున్నా. హీరో శ్రీకాంత్ సన్నిహితులు చిరంజీవి ఈవెంట్ నిర్వహించారు. కోటి వచ్చిందట. అదే తెలుగు రాష్ట్రాల్లో చేస్తే 5 కోట్లు వస్తాయి” అంటూ చెప్పుకొచ్చారు. అదంతా తెలుగు ప్రజలకూ తెలుసు.
ఉప్పూ నిప్పులా ఒకరిపై మరొకరు మాటల కత్తులు దూసిన శివాజీరాజా, నరేశ్ ఒక్కటి అయ్యారు. తెలుగు సినిమా పెద్దల సమక్షంలో భుజాలపై చేతులు వేసుకుని ఫొటోలకు పోజులు ఇచ్చారు. ‘మా’లో గొడవల్లేవ్… సమస్యల్లేవ్… అని పెద్దలు కూడా తేల్చేశారు.
“మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కి రావలసిన డబ్బులు కరెక్టుగా వచ్చాయి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. మిగిలినది ఏమైనా వుంటే మనకు సంబంధం లేదు. మనం చేసుకున్న ఒప్పందం ప్రకారం మనకు డబ్బులు వచ్చాయి” అని తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టత ఇచ్చారు. ఈమధ్య కాలంలో అనవసరంగా మీడియాలో ఎక్కువ చర్చ జరిగింది కాబట్టి స్పష్టత ఇవ్వాలని వచ్చామని చెప్పారు. మీడియాలో చర్చ జరగడమే తప్ప… ‘మా’లో తప్పుల్లేవని తేల్చారు. మాకు కోపరేట్ చేయమని మీడియాని కోరారు. అక్కడితో సమావేశం ముగిసిందని వెళ్లబోయారు. మీడియా ప్రతినిధులు తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కోరగా… ముందు నిరాకరించారు. కొన్ని రోజుల ముందు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్న శివాజీరాజా, నరేశ్ ఎలా కలిసి పనిచేశారు? అని ప్రశ్నిస్తే “ఇప్పుడు వాళ్లను కొట్టుకోమంటారా?” అని తమ్మారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వమని ఖరాఖండిగా చెప్పారు. “లోపల జరిగేవి జరుగుతాయి. అవన్నీ బయటకు చెప్పి అల్లరి చేసుకోవలసిన అవసరం లేదు. ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడదాం” అని పేర్కొన్నారు.
శివాజీరాజాపై ఓ స్థాయిలో ఆరోపణలు చేసిన నరేశ్ సింపుల్గా… ఏ పరిశ్రమలోనైనా అభిప్రాయం బేధాలు రావడం మానవ సహజమని నరేశ్ అన్నారు. “గతం గతః ఇకపై అందరూ కలిసి పని చేస్తాం” అని సెలవిచ్చారు. పదిమంది హీరోలు పూనుకుంటే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కి బిల్డింగ్ కట్టడం పెద్ద కష్టమా? అనగా… ఆ విషయం హీరోలను అడగమని సురేశ్ బాబు చెప్పారు. సినిమా ఇండస్ట్రీ పూర్ ఇండస్ట్రీ అనేది ఆయన మాట. ఈ విషయంలో మీడియా ప్రతినిధులకు అవగాహన లేదని విమర్శించారు. సినిమా పెద్దలందరూ కలిసి మీడియాని తప్పుబట్టడం లేదంటూనే మీడియాపై వేలెత్తి చూపించారు.
ఏతావాతా తేలిందేంటంటే… ‘మా’లో సమస్యలు లేవు. అంతా మీడియా సృష్టే అట! సినిమా పెద్దల వ్యవహారశైలిపై మీడియా ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.