..అంటే, ఈ చర్చ ఇంకా తెరాస వర్గాల్లో ఇంకా బలంగానే ఉందన్నమాట! తెర మరుగైందనుకున్న అంశం తెర చాటునే ఉన్నట్టుగా భావించాలన్నమాట. అదేనండీ, అధికార పార్టీలో ముఖ్యమంత్రి కేసీఆర్ తరువాత రాజకీయ వారసుడు ఎవరనే అంశం! ఎప్పుటికప్పుడు ఈ చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తూనే ఉంటుంది. కేసీఆర్ రాజకీయ వారసుడిగా మంత్రి కేటీఆర్ ను తయారు చేస్తున్నారనీ, ఈ క్రమంలో మరో మంత్రి హరీష్ రావు ప్రాధాన్యతను తగ్గిస్తూ వస్తున్నారనే కథనాలు చాలానే వినిపించాయి. ప్రభుత్వంలో కేటీఆర్ అత్యంత క్రియాశీలకంగా చేయడం వెనక సీఎం వ్యూహం ఇదే అనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. అయితే, ఈచర్చ తెరమీదికి వచ్చిన ప్రతీసారీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూనే ఉంటారు. హరీష్ రావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేస్తుంటారు. పార్టీ వారసులు ఎవరు అనే చర్చే లేదని అంటుంటారు. ఇప్పుడు కూడా ఇదే అంశమై మరోసారి మంత్రి కేటీఆర్ స్పందించడం విశేషం.
మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్థావించారు. తనతో హరీష్ రావుకి ఎలాంటి భేదాభిప్రాయాలు లేవనీ, ఇద్దరి మధ్యా సరైన సమన్వయం ఉందన్నారు. పాలనలో ఇద్దరమూ తమదైన పాత్ర పోషిస్తున్నామని చెప్పుకొచ్చారు. తమ ఇద్దరితో పోల్చితే ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ఫిట్ గా ఉన్నారనీ, ఆరోగ్యపరంగా ఆయనే బెటర్ గా ఉన్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. మంత్రి హరీష్ రావు, తాను కలిసి ఎంతో స్పష్టతతో పనిచేస్తున్నామని చెప్పారు. అంటే, తెరాసలో వారసత్వ చర్చ అనేదే జరగడం లేదని మరోసారి చెప్పేందుకు కేటీఆర్ ప్రయత్నించారు. 2019 ఎన్నికలు కేసీఆర్ నాయకత్వంలోనే జరుగుతాయనీ, ఎలాంటి మార్పులూ ఉండబోవని స్పష్టం చేసినట్టయింది.
నిజానికి, గతంలో కూడా వారసత్వం అంశం తెరమీదికి వచ్చినప్పుడు కేటీఆర్ ఇదే వాదన వినిపించారు. అక్కడితో ఆచర్చ ముగిసినట్టే అనుకున్నారు. కానీ, ఇప్పుడు మళ్లీ దాని గురించి ఆయన మాట్లాడారూ అంటే… పార్టీ వర్గాల్లో ఇంకా ఈ వారసత్వ పోరు అంశం తెరమీదే ఉందని అనిపిస్తోంది. సమస్యలేవీ లేనప్పుడు ఈ చర్చ ఎందుకు అనేదే అసలు ప్రశ్న..? గ్రేటర్ ఎన్నికల విషయంలోగానీ, ఇతర ప్రభుత్వ వ్యవహారాల్లోగానీ, మంత్రుల ర్యాంకింగ్ అంశంలోగానీ కేటీఆర్ కు అధిక ప్రాధాన్యం లభిస్తోందనే అభిప్రాయం ఆ మధ్య పార్టీ వర్గాల్లో వినిపించింది. పనిలోపనిగా మంత్రి హరీష్ రావుకు ఈ ర్యాంకుల వంటివాటిలో సరైన స్థానం లభించడం లేదనే చర్చ కూడా జరిగింది. ఇదంతా ఆధిపత్య పోరులో భాగమే అనే అభిప్రాయం వ్యక్తమైంది. ఏదేమైనా, ఈ వారసత్వ అంశం 2019 ఎన్నికల్లో కీలకాంశంగా మారుతుందేమో చూడాలి. తమ మధ్య స్పష్టత ఉందని నాయకులు చెబుతున్నా… కిందిస్థాయి కేడర్ లో ఎలాంటి అభిప్రాయం ఉందనేది కదా ముఖ్యం!