ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్రపై రకరకాల అంచనాలూ అభిప్రాయాలూ వున్నాయి. అయితే అసెంబ్లీని బహిష్కరించడం పొరబాటనే విషయంలో మాత్రం వైసీపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలూ విమర్శ చేస్తున్నాయి. కాకుంటే కొందరు పరిమితంగా అంటుంటే మరికొందరు దాన్ని ఒక పెద్ద చర్చనీయాంశం చేస్తున్నారు. పిసిసి అద్యక్షుడు రఘువీరాతో సహా కాంగ్రెస్ నాయకులైతే ఈ అంశంలో గట్టిగానే కేంద్రీకరిస్తున్నారు. ఇంతకూ జగన్ ఎందుకు సభా బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారంటే తను లేకుండా తమ వారెవరో నాయకత్వం వహించడం ఇష్టం లేకనే అన్నది ఆ పార్టీవారితో సహా అనేక మంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. సభలో చర్చల్లోనూ సింహభాగం తనే తీసుకుని మిగిలిన వారికి స్వల్పంగానే సమయం ఇవ్వడం ఆయనకు అలవాటుగా మారింది. ఇలాటి విమర్శలు వచ్చినప్పుడు మాత్రం ఒకరిద్దరికి అవకాశం ఇచ్చినా మళ్లీ కథ మొదటికే వస్తుంటుంది. ఇప్పుడు ఆరుమాసాల సుదీర్ఘ కాలం మరెవరైనా నాయకుడుగా మాట్లాడితే, తన తదుపరి స్థానం వచ్చినట్టే అవుతుంది. ప్రాంతీయ పార్టీలలో నెంబర్ టూ అన్నది ఎప్పుడూ పెద్ద సమస్యే. అసలు అలాటి బెడదకు అవకాశం లేకుండా చేసేందుకు జగన్ సభా బహిష్కరణ అస్త్రం ప్రయోగించారనే పార్టీ ఎంఎల్ఎలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. వీరికి సభ వెలుపల ప్రత్యేకంగా ఏదో కార్యక్రమం ఇవ్వాలనే ఆలోచన కూడా తేలిగ్గానే తీసుకుంటున్నారు. మొత్తంపైన సభా బహిష్కారం ద్వారా జగన్ రాజకీయంగా వంటరి కావడమే గాక అంతర్గతంగానూ పొరబాటు సంకేతాలు ఇచ్చినట్టయింది.