మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు… ఈ మధ్య వార్తల్లో అస్సలు కనిపించడం లేదు! టీడీపీ సర్కారుపై ఏపీ భాజపా నేతలంతా ప్రతీరోజూ ఆరోపణలు చేస్తున్నారు. భారీ కుంభకోణాలు, అవినీతి అంటూ పోరాటాలకు దిగుతున్నారు. ఆంధ్రాకి కేంద్రం ఎంతో చేసిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసే కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇంకోపక్క, పోలవరం జాతీయ ప్రాజెక్టు అనీ, దీనిపై మోడీ చేసిన కృషిని ప్రజలకు వివరించాలని జాతీయ నాయకత్వం పిలుపునివ్వడంతో… అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు వంటి నేతలు టీడీపీపై విమర్శలు చేయడంలో బిజీబిజీగా ఉంటున్నారు. ఇంత జరుగుతున్నా… మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు మాత్రం భాజపా నేతలతో కనిపించడం లేదు.
కేంద్రమంత్రి జేపీ నడ్డా శుక్రవారం నాడు మంగళగిరికి వస్తే… అక్కడ కామినేని కనిపించారు. వచ్చే ఏడాది జనవరి నాటికి ఎయిమ్స్ ఔట్ పేషెంట్ బ్లాక్ ని పూర్తి చేస్తామని నడ్డా ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి, ఎయిమ్స్ విషయమై మంత్రిగా ఉండగా కామినేని కూడా బాగానే కృషి చేశారు. కొన్నాళ్లపాటు భూసేకరణ, అనుమతులు వంటి అంశాల్లో జాప్యం జరిగింది. ఆ తరువాత, ఒక్కోటిగా అనుమతులు వస్తున్న తరుణంలో ఆయన మంత్రి వర్గం నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. భాజపాతో టీడీపీ పొత్తు తెంచుకోవడంతో.. ఏపీ క్యాబినెట్ నుంచి భాజపా మంత్రులు బయటకి వచ్చేసిన సంగతి తెలిసిందే. నిజానికి, మొదట్నుంచీ కామినేనిపై ఉన్న ముద్ర ఏంటంటే… ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్గీయుడని, ఏదో ఒక రోజున టీడీపీలో చేరడం ఖాయమని..!
క్యాబినెట్ నుంచి తప్పుకున్న తరువాత ఆయన భాజపా కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా, రాష్ట్ర స్థాయిలో భాజపా నేతలు చేపట్టే కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అలాగని భాజపాకి పూర్తిగా దూరంగా ఉంటున్నారనీ చెప్పలేం. ఢిల్లీ నుంచి జాతీయ నేతలు ఎవరైనా ఆంధ్రాకి వచ్చినా, వారు ఏదైనా కార్యక్రమం నిర్వహించినా కామినేని హాజరౌతున్నారు. అంతే తప్ప… రాష్ట్ర నేతలు చేపట్టే కార్యక్రమాలను పట్టించుకోవడం లేదు. అంతేకాదు, సొంత నియోజక వర్గం కైకలూరులో కూడా ఆయన ఈ మధ్య క్రియాశీలంగా ఉండటం లేదని సమాచారం. దీంతో ఆయన భాజపాలో ఇంకా ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదనే అంచనాలు మళ్లీ వినిపిస్తున్నాయి. శుక్రవారం నాడు కేంద్రమంత్రి జేపీ నడ్డాతోపాటు కామినేని మీడియాలో కనిపించేసరికి… మరోసారి ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి. ఇంతకీ, కామినేని రాజకీయ పయనమెటు..? ఆయనకి భాజపాకి దూరంగా ఉంటున్నారనీ చెప్పలేం, కానీ రాష్ట్ర భాజపా నేతలకు దూరంగా ఉంటున్నారన్నది వాస్తవం! అంటే, ఆయనకి రాష్ట్ర భాజపా నేతల తీరు నచ్చడం లేదా అనే అభిప్రాయమే వ్యక్తమౌతోంది.