ఎన్టీఆర్ బయోపిక్ అంటే… ఓతరం తెలుగు సినిమా చరిత్ర అనుకోవాలి. తెలుగు సినీ పరిశ్రమ వైపు యావత్ భారతదేశం చూసేలా చేశారు ఎన్టీఆర్. అటు పౌరాణిక, ఇటు జానపదం, సాంఘికం.. ఇలా ఎలాంటి కథలోనైనా ఎన్టీఆర్ విజృంభించేసేవారు. ఆయన సమకాలికులతోనూ చక్కటి అనుబంధం ఉండేది. ముఖ్యంగా ఏఎన్నార్‌ని సోదరుడిలా భావించేవారు. ఎన్టీఆర్ బయోపిక్‌లో ఏఎన్నార్ పాత్రకు సముచిత స్థానం ఉంది. అయితే ఆ తరువాతి తరం నుంచి వచ్చిన కృష్ణ, శోభన్ బాబుల పాత్రలకు ఎన్టీఆర్ బయోపిక్‌లో చోటు దక్కలేదు. స్క్రిప్టు దశలో వీరిద్దరి పాత్రలూ ఉన్నా…. సరైన నటీనటులు దొరక్క ఆ పాత్రలన్ని హైడ్ చేసినట్టు సమాచారం. కృష్ణ పాత్రో మహేష్‌బాబు కనిపిస్తారని ప్రచారం జరిగింది. బాలయ్య కూడా మహేష్ తో ఈ పాత్రని చేయించాలనుకున్నారు. కానీ…మహేష్ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన రాలేదు. దాంతో కృష్ణ పాత్ర లేకుండానే `ఎన్టీఆర్` బయోపిక్ ముగియనుంది. మరోవైపు శోభన్ బాబు పాత్ర కూడా ఎన్టీఆర్ బయోపిక్‌లో కనిపించే అవకాశం లేదని తెలుస్తోంది. కృష్ణతో పోలిస్తే… ఎన్టీఆర్ కెరీర్లో శోభన్ బాబు పాత్ర చాలా తక్కువ. కృష్ణ పాత్రే లేనప్పుడు ఇక శోభన్ బాబు పాత్రనిచూపించడంలో అర్థం లేదు. అందుకే… శోభన్ బాబు పాత్ర కూడా హైడ్ చేశారు. సూరేకాంతం, కృష్ణంరాజు, మోహన్‌బాబు… ఇలా కొన్ని పాత్రలు ఎన్టీఆర్ బయోపిక్‌లో మరుగున పడిపోయాయి.