ఈ సంక్రాంతికి 3 సినిమాలు రాబోతున్నాయి. గేమ్ ఛేంజర్, డాకూ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం పోటీ పడుతున్నాయి. సాధారణంగా పెద్ద సినిమాలంటే విడుదలకు ముందు కాస్త హై టెన్షన్ ఉంటుంది. చివరి నిమిషం వరకూ ఏదో ఓ వర్క్ జరుగుతుంటుంది. రీ రికార్డింగ్లు, ఫైనల్ మిక్సింగులూ అంటూ ఆఖరి నిమిషంలో పరుగులు పెడుతుంటారు. ఈ సంక్రాంతి సినిమాల్లో ఒక సినిమా ఇలాంటి టెన్షన్లోనే ఉందంటూ వార్తలొస్తున్నాయి. సెకండాఫ్లో రీ రికార్డింగ్ ఇంకా పూర్తవ్వలేదని, ఆ విషయంలో చిత్రబృందం తర్జనభర్జనలు పడుతోందని చెప్పుకొంటున్నారు.
అయితే.. ఈ సంక్రాంతి సినిమాల్లో దేనికీ లాస్ట్ మినిట్ టెన్షన్లు లేవని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. గేమ్ ఛేంజర్ సెన్సార్ ఎప్పుడో అయిపోయింది. సంక్రాంతికి వస్తున్నాం కూడా ఆ ఫార్మాలిటీ పూర్తి చేసుకొంది. ఇక మిగిలింది డాకూ మహారాజ్ ఒక్కటే. సోమవారం ఈ సినిమా సెన్సార్ జరుపుకొంటోంది. ఆదివారంలోగా ఫైనల్ కాపీ రెడీ అయిపోతుంది. రన్ టైమ్ కూడా లాక్ అయిపోయిందని, ఈ సినిమా విషయంలోనూ టెన్షన్లు లేవని తెలుస్తోంది.
ప్రమోషన్ల పరంగానూ మూడు సినిమాలూ జోరుమీదే ఉన్నాయి. గేమ్ ఛేంజర్ ప్రెస్ మీట్ ముంబైలో జరిగింది. ఈసాయింత్రం రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ వుంది. 6న సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ విడుదల చేస్తారు. అదే రోజు ప్రీ రిలీజ్ వేడుక మహబూబ్నగర్లో ఉంటుంది. ఇక డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ వేడుక ఫిక్స్ అవ్వాలి.