ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్న సందేహాలు తీవ్రంగా తలెత్తుతున్నాయి. ఓ వైపు రోజూ.. ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఒక్కరంటే ఒక్కర్నీ పట్టుకోలేకపోతున్న పోలీసులు… ఆందోళనలు చేస్తున్న రాజకీయ పార్టీల నేతలపై కేసులు పెట్టి… అదే గొప్ప ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారు. మరో వైపు.. తెలుగుదేశం పార్టీ నేతల హత్యలు వరుసగా జరిగిపోతున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో మున్సిపల్ కమిషనర్ సమక్షంలోనే నందం సుబ్బయ్య అనే టీడీపీ నేతను హత్య చేస్తే… ఇప్పుడు… ఇరవై ఏళ్లు ఓ మేజర్ పంచాయతీగా సర్పంచ్‌గా పని చేసిన నేతను గుంటూరు జిల్లాలో చంపేశారు. ప్రొద్దుటూరులోలాగే ఫోన్ చేసి పిలిపించి హత్య చేశారు. పెదగార్లపాడు సర్పంచ్ అంకులు హత్య ఇప్పుడు… రాష్ట్రంలో సంచలనాత్మకం అవుతోంది.
నందం సుబ్బయ్య హత్య ఘటన తర్వాత … నారా లోకేష్ కడప జిల్లాకు వెళ్లి…ఎమ్మెల్యే, ఆయన బావమరిదినే హ త్యకు కుట్ర పన్నారని.. వారిపై కేసు పెట్టాల్సిందేనని పోరాడారు. ఆ వివాదం ఇంకా కళ్ల ముందు ఉండగానే… మరో హత్య జరిగిపోయింది. ఫోన్ చేసి పిలిపించి మరీ.. మాజీ సర్పంచ్ అంకులును చంపేశారు. ఆయన మాజీ ఎమ్మెల్యే యరపతినేనికి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. ఇటీవలి కాలంలో గురజాలలో రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పార్టీలు మారాలని ద్వితీయ శ్రేణి నేతలపై ఒత్తిడి చేస్తున్నారు. వారి ఆస్తులపై దాడులు చేస్తున్నారు. అలాగే ఓ సిమెంట్ ఫ్యాక్టరీ భూముల వివాదంలో పోరాడిన వారిని కూడా టార్గెట్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అన్నీ కలిపి కుట్ర పూరితంగా కొంత మందిని టార్గెట్ చేసి హత్యలు చేస్తున్నారన్న విమర్శలు టీడీపీ వైపు నుంచి వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రశాంత పరిస్థితులు లేవు. అంతా గందరగోళంగా ఉంది. ఎప్పుడు ఎక్కడ… గుళ్లపై దాడులు జరుగుతాయో తెలియడం లేదు. ఎప్పుడు… టీడీపీ నేతలు హత్యకు గురవుతారో అంచనా వేయలేని పరిస్థితి ఉంది. స్వయంగా మాజీ ఎమ్మెల్యే ఇంట్లోకి… ఓ ఎమ్మెల్యే కత్తులు, కటార్లతో వెళ్లి వీరంగం చేసిన దృశ్యాలు కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే, ఆయన కుటుంబసభ్యులు ఇంట్లో ఉండి ఉంటే ఎలాంటి పరిస్థితులు ఏర్పడి ఉండేవో అంచనా వేయడం కష్టంగా ఉంటుంది. ఈ వ్యవహారాలన్నింటిలోనూ పోలీసుల వైఖరి తేలిపోయింది. శాంతిభద్రతలు కాపాడటం కన్నా… పక్షపాతంగా వన్ సైడ్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఫలితంగా… పరిస్థితులు అంతకంతకూ దిగజారిపోతున్నాయి కానీ మెరుగుపడటంలేదు.
వైసీపీ సర్కార్ వచ్చిన తరవాత పదహారు మంది టీడీపీ నేతల్ని హత్య చేశారని.. తెలుగుదేశం పార్టీ జాబితా విడుదల చేసింది. ఒక వేళ వారెవరైనా వ్యక్తిగత వివాదాల వల్ల హత్యకు గురైనా… పోలీసుల వైఫల్యంగా స్పష్టంగా ఉన్నట్లే అవుతుంది. రాష్ట్రంలో ఇంటలిజెన్స్ వ్యవస్థ నిర్వీర్యమైపోయినట్లుగా భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఏపీలో బీహార్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోలీసుల్లో మార్పురాకపోతే.. ప్రజలకు పూడ్చుకోలేనంత నష్టం చేసిన వారవుతారు.