గ్రామ, వార్డు సచివాలయాల గురించి ఏపీ ప్రభుత్వం కీలక విషయం బయట పెట్టింది. ఇప్పటి వరకూ ఈ గ్రామ, వార్డు సచివాలయాలకు చట్టబద్ధత లేదు. త్వరలో చట్టం చేసి చట్టబద్ధత తెస్తామని ప్రభుత్వం స్వయంగా హైకోర్టుకు తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాలకే చట్టబద్ధత లేనప్పుడు అందులో పని చేసే ఉద్యోగులకు ఉంటుందా అనే కొత్త సందేహం రావడం సహజమే. ప్రభుత్వం మారిదే ఆ ఉద్యోగులకు ప్రొబేషన్ ఇచ్చినా సరే చిక్కులు తప్పవన్న వాదన ప్రస్తుత ప్రభుత్వం తీరు వల్ల వచ్చినట్లుగా కనిపిస్తోంది.
ఇటీవల గ్రామ మహిళా కార్యదర్శులను పోలీసు శాఖలో విలీనం చేయాలని నిర్ణయించారు. పోలీస్ డ్రెస్ వేసుకుని విధులు నిర్వహించాలన్నారు. అయితే ఈ నిర్ణయంపై వ్యతిరేకతతో పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. కొంత మంది మహిళా కార్యదర్శులు తాము పోలీస్ యూనిఫాం వేసుకోబోమన్నారు. మరికొంత మంది అసలు ఏ శిక్షణ లేకుండా.. సరైన నియామక ప్రక్రియ చేపట్టకుండా పోలీసుల్లో మహిళా కార్యదర్శులను ఎలా చేరుస్తారని పిటిషన్ వేశారు. వీటిపై జరిగిన విచారణలో ప్రభుత్వం వద్ద సమాధానం లేకపోయింది. అందుకే చట్ట ప్రకారం చేశామని చెప్పుకోవడానికి చట్టం చేస్తామన్న వాదనను ప్రభుత్వం ముందు తీసుకొచ్చారు .
గ్రామ, వార్డు సచివాలయాలు పంచాయతీరాజ్ వ్యవస్థకు ప్రత్యామ్నాయం అనే విమర్శలు ఉన్నాయి. పంచాయతీలను నిర్వీర్యం చేసి… గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాలన చేస్తున్నారని ఇది రాజ్యాంగ విరుద్ధమన్న వాదన ఉంది. ఇలాంటి సమయంలో చట్టం ఏమని చేస్తారో తేలాల్సి ఉంది. గ్రామ, వార్డు సచివాలయాలకు .. పంచాయతీ లేదా స్థానిక సంస్థలు నిర్వహించాల్సిన విధులు కేటాయించినట్లుగా చట్టంలో పేర్కొంటే నిలబడే చాన్స్ లేదు. అందుకే గ్రామ, వార్డు సచివాలయాలకు చట్టబద్దత అనేది కష్టమేనన్న అంచనా కూడా ప్రారంభమయింది.