సాధారణంగా కొత్తగా అధికారం చేపట్టిన ముఖ్యమంత్రులు మొట్ట మొదట ప్రభుత్వ ఉన్నతాధికారులతో, పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమవడం, తమ ప్రాధాన్యతల గురించి వారికి చెప్పడం జరుగుతుంటుంది. నిన్న మళ్ళీ ఐదవసారి బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నితీష్ కుమార్ కూడా అదే పని చేసారు. ఆయన రాష్ట్ర ఉన్నత స్థాయి పోలీస్ అధికారులతో తన మొట్టమొదటి అధికారిక సమావేశం వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో నిర్వహించారు. ఆ సమావేశంలో రాష్ట్రంలోని పోలీస్ ఐ.జి., డి.ఐ.జి.,ఎస్.పి.,డి.ఎస్.పి. స్థాయి పోలీస్ అధికారులు అందరూ పాల్గొన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటానికి తను అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నానని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పారు. శాంతి భద్రతలు విషయంలో ఎవరూ రాజీపడినా సహించనని స్పష్టంగా చెప్పారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న వారెవరినీ వారు ఎంతటి వారయినా ఉపేక్షించనవసరం లేదని వారిని నేరస్తులుగానే పరిగణించి చట్ట ప్రకారం వారిపై కటినమయిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో పోలీసులు అందరూ చట్టాన్ని చాలా ఖచ్చితంగా అమలుచేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎవరు అలసత్వం వహించినా సహించబోనని అందరినీ హెచ్చరించారు.
నితీష్ కుమార్ తన మొట్టమొదటి అధికారిక సమావేశం రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులతో నిర్వహించడం చాల సర్వ సాదారణమయిన విషయంలాగే పైకి కనబడుతున్నపటికీ, ఆయన తమ ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగా ఉన్న “లాలూ ప్రసాద్ యాదవ్ అండ్ సన్స్” ని ఇప్పటి నుండే పూర్తిగా కట్టడి చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు భావించవచ్చును. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ రాష్ట్రాన్ని పరిపాలించినపుడు రాష్ట్రం అన్ని విధాల అధోగతి పాలయింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, హత్యలు, కిడ్నాపులు జరుగుతుండేవి. రాష్ట్రంలో అరాచకం, అధికారులలో అవినీతి, అసమర్ధత కళ్ళకు కట్టినట్లు కనబడుతుండేవి. దానినే మోడీ, అమిత్ షాలు ‘ఆటవిక రాజ్యం’గా అభివర్ణించారు.
ఆ తరువాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమార్, చాలా కష్టపడి రాష్ట్రంలో ఆ పరిస్థితులనన్నిటినీ చక్కదిద్ది, మళ్ళీ అన్ని వ్యవస్థలను గాడిన పెట్టారు. కానీ మళ్ళీ లాలూ ప్రసాద్ యాదవ్ అండ్ కో ఇప్పుడు అధికారంలోకి వచ్చేరు కనుక మళ్ళీ అవే పరిస్థితులు పునరావృతం అవుతాయని నితీష్ కుమార్ కూడా భయపడుతున్నట్లున్నారు. అందుకే ఆయన హోం శాఖను తన వద్దే అట్టేబెట్టుకొని, మొట్ట మొదట పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యి శాంతి భద్రతల విషయంలో రాజీపడితే సహించనని, చట్టాన్ని ఉల్లంఘించే వారు “ఎంత పెద్దవారయినప్పటికీ” ఉపేక్షించవద్దని గట్టిగా హెచ్చరించారు.
ఆ హెచ్చరికలు తనను ఉద్దేశ్యించి చేసినవేనని బహుశః లాలూ ప్రసాద్ యాదవ్ కూడా గ్రహించే ఉంటారు. కానీ అధికారం చేతిలో ఉన్నపుడు కూడా ఎంతో కాలం చట్టాన్ని అతిక్రమించకుండా ఉండటం ఆయనకి చాలా కష్టం. కనుక ఏదో ఒకరోజు ఆయన చట్టాన్ని ఉల్లంఘించడం ఖాయం అప్పుడు నితీష్ కుమార్ ఏమి చేయాలో పాలుపోక మాసిన గెడ్డం గోక్కోవడం కూడా ఖాయం. ఇటువంటివి చూసే ఇల్లలకగానే పండగ కాదు…ముందుంది ముసళ్ళ పండగ..వంటి మాటలు పుట్టుకొచ్చాయని అనుకోవాలి.