నియంత్రణ హక్కు వొదులుకుంటున్న ఎపి?
ప్రభుత్వ భూముల్లో పరిశ్రమలు స్ధాపించదలచిన వారు ఇకపై సుదీర్ఘకాలం ఆభూమిని లీజుకి తీసుకోనవసరం లేదు. డబ్బు చెల్లించి భూమిని నేరుగా కొనేసుకోవచ్చు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మూడు వారాల క్రితం జారీ అయిన జిఓ ఎంస్ 48 స్పష్టం చేస్తోంది.
2015 నుంచి 2020 సంవత్సరం వరకూ రాష్ట్రప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక విధానం ప్రకారం పరిశ్రమలు స్ధాపించదలచిన వారికి ఇతర అర్హతలు అన్నీ కూడా వుంటే స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు భూమిని లీజుపై ఇస్తుంది. ఈ బోర్డుకి ముఖ్యమంత్రి చైర్మన్ గా వుంటారు.
లీజు కి బదులు డైరక్ట్ సేల్ పెడితే హెచ్చు పరిశ్రమలు వచ్చే అవకాశాల గురించి ఒక కేబినెట్ సమావేశంలో చర్చకు రాగా ప్రధాన కార్యదర్శి, ముగ్గురు మంత్రులు వ్యతిరేకించారని తెలిసింది. పరిశ్రమ దైనందిన వ్యాపకాలతో ప్రభుత్వ జోక్యం ఉండకపోయినప్పటికీ, (99ఏళ్ళు, 66 ఏళ్ళు, 33ఏళ్ళ) లీజుల వల్ల పరిశ్రమ పై ప్రభుత్వ నియంత్రణ వుంటుందని, జవాబూదారీ తనాన్ని ఫిక్స్ చేయడానికి లీజు విధానం అవసరమనీ వారు సూచించారని తెలిసింది. అయితే సమావేశంలో ఏ నిర్ణయమూ తీసుకోలేదు.
ఇది జరిగిన నెలలోపే లీజుకి బదులు డైరక్ట్ సేల్ నిర్ణయాన్ని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యమంత్రి చైర్మన్ గా వున్న బోర్డు కి వెళ్ళనవసరం లేకుండానే ఇతర నియమ నిబంధనలకు లోబడి వున్న దరఖాస్తు దారులకు సంబందిత శాఖ భూములను నేరుగా విక్రయించ వచ్చని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.
ప్రభుత్వ నియంత్రణా హక్కుని కోల్పోయేటంత సరళీకరణ పట్ల అధికార వర్గాల్లో ఆశ్చర్యం, అనుమానం కూడా వ్యక్తమౌతోంది. కేంద్రం నుంచి ప్రత్యేక హోదాతో సహా రాష్ట్రానికి ఏ అదనపు లేదా ప్రత్యేక సహాయం అందే అవకాశం లేదని చంద్రబాబు నిర్ధారణకు వచ్చేశాకే త్వరత్వరగా పరిశ్రమలు వచ్చేలా చూడటానికి దీర్ఘకాలిక లీజుని షరతులు లేని అమ్మకంగా మార్చివేశారని భావిస్తున్నారు. అయితే, ఇలాంటి సొంతదారుల వల్ల ప్రజల ఆస్ధిని షరతులు లేకుండా పరిశ్రమలకు కట్టబెట్టడం ప్రమాదకరమని భావిస్తున్నారు.
ఏ భారీ పరిశ్రమ వ్యవస్ధాపకులూ ముఖ్యమంత్రిని కలుసుకోకుండా భూమికొనేసి పరిశ్రమ పెట్టరు. బోర్టు చైర్మన్ హోదాలో ముఖ్యమంత్రి జరిపే సంప్రదింపుల వివరాలు, నిర్ణయాలు మినిట్స్ లో నమోదౌతాయి. ఆపద్ధతి తొలగించి అధికారుల మీదే బాధ్యత మోపడమంటే తెరవెనుక అధికారం చెలాయించడానికేనా అన్న అనుమానం కూడా వుంది. అయితే, పాలకుల ఇష్టారాజ్యంగా ఫైళ్ళు నడపడానికి అధికారులు సిద్ధంగా లేరు. వత్తిడి పెరిగితే రాష్ట్రం వదలిపోడానికి కూడా వారు సిద్ధంగానే వున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జగన్ ప్రమేయంతో జరిగిన అవినీతికి మంత్రి, అధికారి, పారిశ్రామికవేత్తలూ జైలుకి వెళ్ళిన అనుభవాలే ఏఅధికారికైనా శ్రీరామరక్ష అన్నట్టు ధైర్యమిస్తాయి.