➡ మహబూబాబాద్ జిల్లాలో అసౌకర్యాలే అసలు ‘పరీక్ష’
➡ ‘పది’ కేంద్రాల్లో వసతుల లేమి, మరో ఎనిమిది రోజుల్లో పరీక్షలు
ఈ నెల 14 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలంటే కనీస వసతులు ఉండాలి. జిల్లా విద్యాశాఖ ఈ ఏడాది జిల్లాలో అధికంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో అసౌకర్యాలు నెలకొన్నాయి. పరీక్షలకు ఎనిమిది రోజుల సమయమే ఉన్నందున కేటాయించిన కేంద్రాల్లో వసతులను చక్కదిద్దితే విద్యార్థులకు పరీక్షలు రాయడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. కొత్తగా ఏర్పాటైన మానుకోట జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషిచేస్తున్న అధికార యంత్రాగం సౌకర్యాల కల్పన పైనా దృష్టి సారించాల్సి ఉంది.
జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 10,120 మంది రెగ్యులర్ విద్యార్థులు, 60 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. సర్కారు పాఠశాలల్లోని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో 45 రోజులపాటు ఉదయం గంట, సాయంత్రం గంటసేపు ప్రత్యేక తరగతులను నిర్వహించారు. వీటి నిర్వహణలో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ప్రతి రోజు విద్యార్థుల ప్రగతిని తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహించడంతోపాటు అదే సమయంలో మూల్యాంకనం చేసి మార్కులను తెలిపారు. వాటి ఆధారంగా ఆయా విద్యార్థులకు తగు సూచనలు ఇచ్చారు. ప్రత్యేక తరగతుల నిర్వహణతో విద్యార్థుల్లో మంచి ఫలితాలు సాధిస్తామనే రెంట్టింపు ఉత్సాహం వచ్చింది. పరీక్ష కేంద్రాల్లోని అసౌకర్యాలే కాస్త నిరుత్సాహనికి గురిచేసేలా ఉన్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
➡ బెంచీలు..తాగునీరే ప్రధాన సమస్య
పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఎంపిక చేసిన కొన్ని కేంద్రాల్లో అసౌకర్యాలు నెలకొంటున్నాయి. చాలా కేంద్రాల్లో తాగునీరు, ఫర్నీచర్ సమస్య ఉంది. చీకటి గదులు ఉన్న కేంద్రాలున్నాయి. పరీక్ష సమయంలో విద్యార్థులు ఉక్కపోతతో ఇబ్బందులు పడకుండా ఫ్యాన్లు ఉండాలి. అయితే కొన్ని పాఠశాలల్లో ఇవి పనిచేయని పరిస్థితి కనిపిస్తోంది. రాయడానికి సౌకర్యవంతంగా ఉండేందుకు అవసరమైన డ్యూయెల్ డెస్క్‌లు లేని కేంద్రాలున్నాయి. ఇలాంటి సమస్య చాలా కేంద్రాల్లో ఉంది. సరిపోనన్ని బెంచీలు లేని కేంద్రాల వారు పక్క పాఠశాలల్లోని బెంచీలు తెచ్చుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రహరీ లేని పాఠశాల ఒకటి ఉంది. పరీక్ష సమయంలో అక్కడ భద్రతను పెంచాల్సిన అవసరం ఉంది. దివ్యాంగుల విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యం కోసం పరీక్ష కేంద్రాల్లో ర్యాంపులు ఉండాలి. ఇవి కొన్ని పాఠశాలల్లో నామమాత్రంగానే ఉన్నాయి. అసలుకే లేని పాఠశాలలు మరి కొన్ని ఉన్నాయి.
➡ పరిశీలనలో ఇవీ నిజాలు
* గార్ల బాలికల ఉన్నత పాఠశాల రెండు గదుల్లో, ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల రెండు గదుల్లో వెలుతురు తక్కువగా ఉంటుంది. రెండు సంవత్సరాల క్రితం ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకుపోగా అప్పటికప్పుడు విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేశారు. ఈ సారి చీకటి గదుల్లోనే పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఉంది.
* మహబూబాబాద్‌లోని కంకరబోడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష రాసేందుకు సరిపడా బెంచీలు లేవు. పాఠశాల చుట్టూ ప్రహరీ లేదు. కొన్ని గదుల్లో ఫ్యాన్ల సౌకర్యం, తాగునీటి సౌకర్యం లేదు.
* గూడూరులోని అయోధ్యపురం ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో సరిపడా బెంచీలు లేవు. ప్రతి సారీ పక్క పాఠశాల నుంచి తీసుకొస్తున్నారు. ఈ ఏడాది కూడా పక్క పాఠశాల నుంచి తీసుకొస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెప్పారు.
*కురవి ఉన్నత పాఠశాలలో డ్యూయెల్ బెంచీలున్నా అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. విద్యార్థులు వాటిపై పరీక్ష రాసేందుకు ఇబ్బందులు పడనున్నారు.