శాసనమండలిలో టీడీపీ నేతలు దాడి చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీలు… వైసీపీ మంత్రులు, ఎమ్మెల్సీలు తొడకొట్టి, జిప్‌లు తీయబోయారంటూ.. టీడీపీ ఎమ్మెల్యీలు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు సభా సంప్రదాయాలను మంటగలిపారని విమర్శలు గుప్పించుకుంటున్నారు. అసలు లోపలేం జరిగిందన్నదానిపై ప్రజలకు కనీస మాత్రం క్లారిటీ లేదు. ప్రత్యక్ష ప్రసారాలు లేవు. సభ్యులు ఎది చెబితే అదే జరిగిందని నమ్మాల్సిన పరిస్థితి.
“పెద్దల సభ”ను ప్రజలకెందుకు చూపించరు..?
శాసనసభలో ప్రత్యక్ష ప్రసారాలను ఠంచన్‌గా ప్రజల ముందు ఉంచుతున్నారు. అయితే అక్కడ ప్రతిపక్ష సభ్యుల దృశ్యాలపై నిషేధం నడిచింది. ఈ సభలో… ప్రతిపక్ష సభ్యులను ఒక్క ఫ్రేమ్‌లో కూడా చూపించలేదు.. అది వేరే విషయం. కానీ అధికార పార్టీ సభ్యులను అయినా చూపించారు. సభ నడిచినంత సేపు ప్రత్యక్ష ప్రసారం చేశారు. కానీ శాసనమండలి విషయానికి వస్తే.. అసలు ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారు. గత సమావేశాల్లోనూ అంతే. స్వయంగా శాసనమండలి చైర్మన్ రూలింగ్ ఇచ్చినా.. సాంకేతిక సమస్య ఉందని.. సరి చేస్తున్నామని చెప్పుకొచ్చారు కానీ ప్రత్యక్ష ప్రసారాలాలు ఇవ్వలేదు. ఇప్పటికీ ఆసాంకేతిక సమస్యను పరిష్కరించలేకపోయినట్లుగా ఉన్నారు.. ఈ సారి కూడా శాసనమండలి సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ఇవ్వలేదు. ప్రజలకు చూపించలేదు.
దృశ్యాలు బయట పెడితే ఎవరేం చేశారో ప్రజలు తేల్చుకుంటారు కదా..!?
మంత్రి అనిల్ హావభావాలు, ప్రవర్తన బయట ప్రెస్‌మీట్లలోనే కాస్త భిన్నంగా ఉంటుంది. ఆయన సినిమాలను చూసి బాగా ఇన్స్పైర్ అవుతూ ఉంటారనే భావన చాలా మందిలో ఉంది. ఇక ప్రత్యక్ష ప్రసారాలు లేని శాసనమండలిలో ఆయన పూర్తిగా కంట్రోల్ తప్పిపోయారన్న విమర్శలు వస్తున్నాయి. తొడకొట్టడమే కాకుండా.. జిప్ తీసే ప్రయత్నం చేయడంతో.. మండలి చైర్మన్ సభను వాయిదా వేశారని చెబుతున్నారు. ఆ తర్వాత మహిళా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి అనిల్‌ను అడ్డుకోవడానికి ఇతర వైసీపీ మంత్రులు కూడా ప్రయత్నం చేశారని చెబుతున్నారు. అదే సమయంలో… టీడీపీ ఎమ్మెల్సీలు తమ మంత్రులపై దాడి చేశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరస్పర ఆరోపణలు ఎందుకు..? నేరుగా మొత్తం వీడియో ఫుటేజీ విడుదల చేస్తే.. ఎవరేం చేశారో ప్రజలే నిర్ణయించుకుంటారు కాద..!
ప్రజలు చూడకూడదనే పనులు అధికారపక్షం చేసిందనే ప్రజల భావన..!
ప్రజలు ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నారన్న స్పృహ ఉన్నప్పుడే ప్రజా ప్రతినిధులు కంట్రోల్ తప్పి పోతున్నారు. జనం చూస్తే.. తాము.. తమ పార్టీ పలుచన అవుతుందని.. వారు అనుకోవడం లేదు. ఇక ఎవరూ చూడటం లేదు.. తమకు తెలియకుండా… తాము వ్యవహరించిన దృశ్యాలు బయటకు రావు అనుకున్న తర్వాత వారు వెనక్కి తగ్గే అవకాశమే ఉండదు. ప్రస్తుతం ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శాసనమండలి సమావేశాలను ప్రజలు చూడకుండా చేయడం ద్వారా…వాళ్లు ఏదో చేయకూడదని చేస్తున్నారని..అందుకే ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేశారనే భావన ప్రజల్లోకి వెళ్తోంది. ఇదే నిజమని నమ్మే ప్రమాదం కూడా ఉంది. ప్రభుత్వం ఈ విషయంలో పారదర్శకత పాటించాల్సి ఉంది.