ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ తలుపులు మూసేసి.. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి.. విభజన చట్టాన్ని ఆమోదించామని.. అప్పటి ప్రభుత్వం ప్రకటించుకుంది. నిజానికి అక్కడ ఏం జరిగిందో.. రికార్డులు కూడా లేవు. ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి లీడర్ టర్న్డ్ లాయర్లు మాత్రం… పంతం పట్టుకుని మరీ.. విభజన రాజ్యాంగ విరుద్ధమని.. సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసి వాయిదాలకు తిరుగుతూంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. మూడు రాజధానుల నిర్ణయానికి శాసనమండలిలో ఆమోదించుకోవడానికి ప్రభుత్వం.. ఈ మార్గాన్నే ఎంచుకుంది. శాసనమండలి ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసింది.
లోపల ఏం జరుగుతుందో.. బయటకు తెలియనివ్వకుండా.. అధికారపక్షం వ్యవహరిస్తోంది. రూల్ నెంబర్ 71 ప్రకారం.. అసలు విభజన చట్టాన్ని చర్చ చేపట్టకుండానే తిరస్కరించడానికి టీడీపీ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ కారణంగానే.. లోపల గందరగోళం ఏర్పిడంది. ఏకంగా… మండలి సభ్యులు కానీ పదిహేను మంది మంత్రులు.. మండలిలో తిష్ట వేశారు. వారందరూ.. మండలి చైర్మన్ పై ఒత్తిడి తెస్తున్నారు. బిల్లు మూజువాణి ఓటుతో పాస్ అయ్యేలా సహకరించాలని ఒత్తిడి చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
అలాగే.. టీడీపీ ఎమ్మెల్సీలకు ప్రలోభాలు కూడా.. చూపిస్తున్నారని.. ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎలాగైనా.. బిల్లును ఆమోదించుకున్నాం..అనిపించుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. దీని ఫలితం ఎలా ఉంటుందో కానీ.. విభజన సమయంలో రాజ్యసభలో జరిగిన..ఘట్టం.. ఇప్పుడు.. ఏపీ శాసనమండలిలో కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. విభజన సమయంలో.. కాంగ్రెస్ వ్యవహరించినట్లే.. ఇప్పుడు.. వైసీపీ వ్యవహరిస్తోందని.. మండి పడుతున్నారు.