కర్ణాటకలో కాంగ్రెస్ – జనతాదళ్ సెక్యూలర్ కూటమి అతి కష్టం మీద అధికారం దక్కించుకున్నప్పటికీ… దాన్ని నిలబెట్టుకోవడం అంత తేలిక కాదు. భారతీయ జనతాపార్టీ… ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాడానికి తమకు తగ్గిన ఎమ్మెల్యేలను సమకూర్చుకోవడం కోసం.. ఆపరేషన్ కమల్ చేపట్టింది. అది విఫలమైంది. ఇప్పుడు కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయినా సరే కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తూనే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. పైగా ఇప్పుడు మరింత ఉద్ధృతంగా అమలు చేసే అవకాశం ఉంది.
జేడీఎస్- కాంగ్రెస్ కూడా ఆ తాను ముక్కలే. రెండు పార్టీల మధ్య బలమైన రాజకీయ, ఆర్థిక, సామాజిక సిద్ధాంతాల సారూప్యతలేమీ లేవు. రెండు పార్టీలను రాజకీయ అవసరాలే కలిపాయి. బీజేపీ అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించినా రాజ్యాంగం ప్రకారం మెజార్టీ రాలేదు. కాంగ్రెస్-జేడీఎస్‌కు ఆ మెజార్టీ ఉంది. అందువల్లే మొదట బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం తప్పుగా ప్రజల్లోకి వెళ్లింది. బీజేపీ-జేడీఎస్ కలిసినా… ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందే. రాజ్యాంగ నిబంధనలప్రకారం ఎవరైనా నడుచుకోవాల్సిందే.
కాంగ్రెస్ -బీజేపీ ఎంత కాలం కలసి ఉంటాయన్నది అనుమానమే. ఎందుకంటే.. ఇప్పటికే రెండు పార్టీల మధ్య ఇప్పటికే మంత్రి పదవుల పంపకంలో వివాదాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లోనే ఉపముఖ్యమంత్రి పదవి కోసం డి.కె.శివకుమార్, పరమేశ్వర మధ్య పోటీ నెలకొంది. ఇవి అంత తేలిగ్గా తేలిపోయే అవకాశం లేదు. ఈ సెగల్ని భారతీయ జనతాపార్టీ మరింత పెంచుతుంది. అవసరం అయితే ఎమ్మెల్యేలను చీల్చుకుని తన రాజకీయం తాను చేసే అవకాశం ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు.
కాంగ్రెస్-జేడీఎస్ .. తమకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకు బీజేపీ కన్నా మెరుగైన సామాజిక, ఆర్థిక, రాజకీయ విధానాలను అవలంభిస్తే… ప్రజలు బీజేపీకి మెరుగైన ప్రత్యామ్నాయం అనుకుంటారు. లేదు.. మామూలు రాజకీయాలు చేస్తే… ఈ కూటమి కన్నా బీజేపీనే మెరుగు అనుకునే పరిస్థితి ప్రజలకు వస్తుంది. అందుకే కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రధమ లక్ష్యం..తాము ఆ తాను ముక్కలం కాదని నిరూపించకోవడమే.