చిరంజీవి ‘సైరా’ విషయంలో చాలా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడు. ఇదో బయోపిక్. తన ఇమేజ్ గురించీ, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించీ ఆలోచించకూడదు. సినిమాకి ఏం కావాలో, అదే ఇవ్వాలి. అందుకే… చిరు తన స్టైల్ నుంచి పూర్తిగా బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. సైరా ఓ స్వాతంత్య్ర యోధుడి కథ. అందుకు తగ్గట్టుగానే హుందాగా ఉండాలి. చిరు ప్రయత్నం కూడా అదే.
`సైరా`లో ఓ జానపద గీతం ఉంది. అందులో చిరంజీవి కొన్ని మాస్ స్టెప్పులు వేయాల్సివచ్చిందట. సినిమా రషెష్ చూసుకుంటున్నప్పుడు చిరుకి ఓ అనుమానం వేసింది. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇలాంటి స్టెప్పులేస్తే.. ఎలా?’ అనిపించిందట. వెంటనే ఆ షాట్‌ని కట్ చేయించేశాడని సమాచారం. సో.. ‘సైరా’లో చిరంజీవి నుంచి ఎదురుచూసే స్టెప్పులు ఏమాత్రం ఉండవన్నమాట. క్లైమాక్స్ విషయంలోనూ చిరు, సురేందర్‌రెడ్డి తర్జన భర్జనలు పడ్డారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తలని బ్రిటీష్‌వారు నరికి, కోట గుమ్మానికి వేలాడదీస్తారు. ఇది చరిత్ర. చిరంజీవిని చంపడం, ఆ తలని వేలాడదీయడం చిరు అభిమానులు హర్షిస్తారా? ఇంత విషాదాంతమైన ముగింపు వాళ్లకు ఎక్కుతుందా? అనే విషయంపై చాలారోజులు చర్చించాక… చరిత్రలో ఉన్నది ఉన్నట్టు తీయమని చిరు ఆర్డరేశాడు. అలా.. క్లైమాక్స్ విషయంలో చిరు చరిత్రనే ఫాలో అయ్యాడు.