ప్రతి పరిణామాన్నీ స్వార్థానికి ఎలా ఉపయోగించుకోవాలో బాగా వంటపట్టించుకున్నాయి మీడియా సంస్థలు. ఏ పరిణామం చోటుచేసుకున్నప్పటికీ సంబంధిత నేతలు లేదా స్థానికులతో తమకు అనుకూలంగా చెప్పించుకుంటూ మైలేజి పొందడానికి ప్రయత్నించే ఈ గొట్టాలు తిరుమలను సైతం విడిచిపెట్టడం లేదు. కనీసం ఇక్కడ రాజకీయాల ప్రస్తావన ఉండకూడదన్న జ్ఞానాన్ని కూడా అవి విడిచిపెట్టేశాయి. వేంకటేశ్వరుని ప్రవేశ ద్వారం ముందే.. రాజకీయ నాయకులనూ, ప్రముఖులనూ అడ్డగిస్తాయి. ఏదో ఒకటి చెప్పే దాకా లేక.. తమకు కావలసిన అంశం వారి నోట వెలువడే దాకా విడిచిపెట్టవు. ఇక అక్కణ్ణుంచి గంటలపాటు ఊదరగొట్టేస్తాయి. స్వామి వారి ముంగిట రాజకీయాలేమిటని రాజకీయ నేతలు అనుకోరు. ప్రత్యర్థిపై విమర్శల వర్షం కురిపించడానికి వెనుకాడరు. పవిత్ర భావంతో స్వామివారిని దర్శించుకుని నిష్కల్మషమైన మనసుతో తిరుమలను వీడితే ఎంతో హుందాగా ఉంటుందని ఒక్కరూ అనుకోరు.
చిన్నపాటి సినిమా క్యారెక్టర్ తిరుమలకు వచ్చినా పదేపదే చూపిస్తారు.. న్యాయమూర్తులు కదిలొస్తే ఊరుకుంటారా.. ఫలానా సుప్రీం కోర్టు న్యాయమూర్తి, జిల్లా న్యాయమూర్తి, ఫలానా నటుడు, ఫలానా పారిశ్రామికవేత్త స్వామివారిని దర్శించుకున్నారని ఊదగొడతారు. వాళ్ళు స్వామిని దర్శించుకుంటే ప్రజలకు ఒరిగేదేమిటి? పత్రికల్లోనూ రంగుల ఫొటోలు ముద్రిస్తారు. ఇంత చేయడం అవసరమా? వచ్చే ముందురోజు తిరుమలలో ఈరోజు అని ఓ కాలమ్లో ఫలానావారు సందర్శిస్తారని ప్రచురిస్తే సరిపోదా. 24 గంటల చానెల్ నడుపుకోడానికి వారిచేత అవాకులూ చెవాకులూ మాట్లాడించి, స్వామివారి క్షేత్రాన్ని ఎందుకు అపవిత్రం చేస్తారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడనని చెప్పి, దానికి కట్టుబడి ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిగురించి ఆలోచించాలి. బాలాజీ ఆలయ పరిసరాలకు కిలోమీటరు లోపు మీడియా ప్రవేశించడానికి వీల్లేకుండా నిషేధం విధించాలి. ప్రెస్ మీట్లు పెట్టుకోవాలంటే తిరుపతిలో మాత్రమే నిర్వహించుకునేలా చర్యలు చేపట్టాలి.
సెలబ్రిటీ తిరుమల వస్తే మీడియాకు పండగేమో కానీ, స్వామి వారికి కాదు. నిష్కల్మష భక్తితో కొలిచేందుకు వచ్చేవారే స్వామివారికి సెలబ్రిటీలు. వారి సేవలో దేవస్థానమైనా..మీడియా అయినా తరించాలి. సామాన్యులకు తిరుమలలో ఎదురయ్యే ఇబ్బందులను తీర్చేందుకు ప్రయత్నించాలి. తమ సంస్థల యాజమానులకు సకల ఏర్పాట్లు చేయడానికి మాత్రమే తిరుమలలో ఉన్న మీడియా ప్రతినిధులు తలమునకలవుతారని చాలా కొద్దిమందికే తెలుసు. ఉత్సవాల సమయంలో ప్రత్యేక సంచికలు వేసి, ఆయా సంస్థలు ఏం పొందుతున్నాయో వారి మనస్సులకు తెలుసు. ఆ సంచిక రూపకల్పనలో పాల్గొన్నవారికి సైతం తిరుమల లోని మీడియా ప్రతినిధులు అడుగులకు మడుగులొత్తుతారు. ఎవరికైనా కావాల్సింది తిరుమల శ్రీవారి కటాక్షాలు తప్ప.. యాజమాన్యాలవి కాదు. తిరుమలను మీడియా చెరనుంచి విడుదల చేయడానికి ముఖ్యమంత్రి చొరవచూపాలి. తిరుమల పవిత్రతతను కాపాడాలి.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి