దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి వరుసగా గెలుస్తూ వస్తున్నా మంత్రి పదవి ముఖం చూడలేకపోయిన కొంత మంది టీడీపీ నేతలకూ ఈ సారి కూడా నిరాశే ఎదురయింది. మంత్రి పదవులు చేపట్టని టీడీపీ సీనియర్లలో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, పయ్యావుల కేశవ్ గురించి ఎక్కువగా ఆ పార్టీలో చర్చ జరుగుతుంది. వారు కమ్మ సామాజికవర్గం కావడం ఓ మైనస్ అయితే ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు సమీకరణాలు కలసి రాకపోవడం మరో ఇబ్బందిగా ఉంటూ వచ్చింది.
అయితే ఈ సారి ఎలాంటి పరిస్థితుల్లోనూ ధూళిఫాళ్ల, పయ్యావులకు చాన్స్ వస్తుందని అనుకున్నారు. పయ్యావుల విషయంలో మాత్రం నిజం అయింది. ఆయనకు కేబినెట్ బెర్త్ దక్కింది. కానీ ధూళిపాళ్లకు మాత్రం కలసి రాలేదు. జనసేన తరపున కేబినెట్ లో చాయిస్ గా నాదెండ్లో మనోహర్ ముందుకు రావడంతో ధూళిపాళ్ల అవకాశాలు అడుగంటిపోయాయి. నారా లోకేష్ కూడా మంగళగిరి కోటాలో మంత్రి పదవి దక్కడంతో గుంటూరుకు రెండు మంత్రి పదవులు అదీ కమ్మ సామాజికవర్గానికే దక్కాయి. ఇక ధూళిపాళ్లకు కేటాయించలేని పరిస్థితి.
ధూళిపాళ్ల తండ్రి వీరయ్య చౌదరి మంత్రిగా చేశారు. ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో నరేంద్ర రాజకీయాల్లోకి వచ్చారు. మొదట్లో ఆయన జూనియర్ అనే కారణంతో పదవి ఇవ్వలేదు. 2014లో చంద్రబాబు అనూహ్యంగా ప్రత్తిపాటి పుల్లారావుకు చాన్సిచ్చారు. దాంతో నరేంద్రకు నిరాశే ఎదురయింది. తర్వాత ప్రభుత్వం రాలేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినా అవకాశం రాలేదు.