ఇటీవల కొంత కాలంగా జన సేన అధినేత పవన్ కళ్యాణ్ కి కేంద్రం లో త్వరలో జరగనున్న మంత్రి వర్గ విస్తరణలో పదవి దక్కే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే తాజా గా నాదెండ్ల మనోహర్ టీవీ చానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లలో చేసిన వ్యాఖ్యల అంతరార్థం ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ కి కేంద్ర మంత్రి పదవి లేనట్లే అన్న విషయం స్పష్టమవుతోంది. వివరాల్లోకి వెళితే..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి ఉప ఎన్నికల తర్వాత చాలా కాలంగా స్తబ్దుగా ఉండి ఇప్పుడు మళ్లీ పోరుబాట పట్టారు. జగన్ వేసిన జాబ్ క్యాలెండర్ యువతలో తీవ్ర నిరుత్సాహం నింపిన దృష్ట్యా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్న విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లడం ద్వారా ప్రభుత్వం కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి ఒత్తిడి చేసేలా పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారన్న సమాచారం ఉంది. జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్, పోతిన మహేష్ విజయవాడలో పవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పటిష్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని టీవీ చానల్స్ కి నాదెండ్ల మనోహర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ కి కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని వస్తున్న వార్తలపై స్పందించమని రిపోర్టర్ కోరారు.
దీనిపై స్పందించిన నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, తాత్కాలిక తాయిలాల కోసం, తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆశ పడరని, దీర్ఘకాలిక ప్రణాళిక తో వ్యూహం తో రాజకీయాలు చేసే ఉద్దేశం పవన్ కళ్యాణ్ కి ఉందని, అంతే తప్పించి తాత్కాలికం గా వచ్చే పదవుల కోసం పవన్ కళ్యాణ్ ఆశ పడరు అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలను విశ్లేషించిన వారికి పవన్ కళ్యాణ్ కి కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం లేదన్న విషయం అర్థమవుతుంది. అయితే మరో వైపు, పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా బిజెపి పెద్దలను కేంద్ర మంత్రి పదవి కావాలని అడగలేదని, పవన్ కళ్యాణ్ బీజేపీని వైఎస్ఆర్సిపి తో కుమ్మక్కు కావద్దు అని మాత్రమే అడిగారని భోగట్టా.
మరి జనసేన అధినేత విజయవాడ పర్యటన ఏ మేరకు విజయవంతం అవుతుందన్నది వేచి చూడాలి.