ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు… ప్రారరంభించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 31వ తేదీలోపు బడ్జెట్ను ప్రవేశ పెట్టి ఆమోదింపచేసుకోవాల్సి ఉంది. లేకపోతే.. నిధుల వినియోగానికి అవకాశం ఉండదు. అయితే.. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అదే తేదీలోపు పూర్తి చేయాలి. లేకుండా.. నిధులు మురిగిపోతాయి. ఈ క్రమంలో..అసెంబ్లీనే ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోంది. అయితే.. అందరిలోనూ వస్తున్న సందేహం ఒక్కటే. శాసనసభను సమావేశ పరుస్తారు సరే.. మరి శాసనమండలిని సమావేశపరుస్తారా ..? లేదా..? అన్నదే. శాసనమండలిని రద్దు చేయాలని.. అసెంబ్లీలో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపారు.
కేంద్రం స్పందన ఏమిటో క్లారిటీ లేదు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన జగన్మోహన్ రెడ్డి… నేటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లోనే మండలి రద్దుకు ఆమోద ముద్ర వేస్తారని.. పార్టీ నేతలకు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ ప్రస్తుతం కేంద్రం నుంచి అలాంటి సూచనలేమీ లేవు. న్యాయశాఖ బిల్లు కూడా సిద్ధం చేయలేదు. పైగా.. అంతకు మించిన కీలక ఎజెండా కేంద్రానికి ఉంది. దీంతో.. శాసనమండలి బిల్లు ఆమోదం పొందడం కష్టమన్న అభిప్రాయం ఉంది. ఈ కారణంగా.. మండలిని కూడా సమావేశపర్చాల్సిన పరిస్థితి వస్తుందన్న అభిప్రాయం ఏర్పడుతోంది.
అలా సమావేశపరిస్తే.. మండలి కార్యదర్శిపై ధిక్కరణ చర్యలు తీసుకోవాలని..టీడీపీ పట్టుదలతో ఉంది. సమావేశపర్చకపోతే రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని అంటున్నారు. సెలక్ట్ కమిటీ బిల్లుల వ్యవహారం కూడా సమావేశాల్లో తేలాల్సి ఉంది. గవర్నర్ ప్రసంగంలో ఆ బిల్లుల ప్రస్తావన ఉంటే.. మండలిలో సవరణలు కోరతామని.. టీడీపీ నేత యనమల స్పష్టం చేశారు. అలా సవరణలు కోరితే.. ప్రభుత్వానికి మరిన్నిచిక్కులు వస్తాయి…దీంతో..మండలి వ్యవహారం మరోసారి కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.