సీఎం జగన్ బహిరంగ సభ పెట్టి మీట నొక్కేశారు. అంటే..క్షణాల్లో అకౌంట్లలో డబ్బులు పడిపోతాయని అనుకున్నారు. కానీ ఇంత వరకూ సగం మందికిపైగా తల్లుల అకౌంట్లలో డబ్బులు పడలేదు. దీంతో వారంతా కంగారు పడుతున్నారు. వాలంటీర్లను ప్రశ్నిస్తున్నారు. అర్హుల జాబితాలో పేరు ఉన్నా కూడా తమకు ఇంకా డబ్బులు రాలేదని లబ్దిదారులు పెద్ద ఎత్తున వాలంటీర్లను ప్రశ్నించడం.. వార్డు సచివాలయాలకు వస్తూండటంతో వారు సర్దిచెప్పలేక సతమతమవుతున్నారు.
విడతల వారీగా అమ్మఒడిలబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. నెలాఖరులో సీఎం జగన్ మీట నొక్కారు. గత నెలలో లిక్కర్ బాండ్లు.. ఆర్బీఐ అప్పులు తెచ్చినా జీతాలకు సరిపోయాయి.. మరికొంత మిగిలాయి. వాటిని మాత్రమే అమ్మఒడి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన వారికి వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్లుగా వేస్తూ వస్తున్నారు. మంగళవారం మరో రెండు వేల కోట్లను ఆర్బీఐ నుంచి ప్రభుత్వం బాండ్లు వేలం వేసి తీసుకుంది. ఇప్పుడు వాటిని తల్లుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
అయితే లబ్దిదారుల సంఖ్యను తగ్గించడమే కాదు ఇప్పుడు ఇచ్చే వారికీ సకాలంలో ఇవ్వకపోవడంతో వారిలోనూ ఈ ప్రభుత్వం ఇక ముందు పథకాలు కొనసాగించగలరా లేదా అన్న సందేహం వస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం మేల్కొని డబ్బులున్నప్పుడే మీటలు నొక్కడం వంటివి చేస్తే బెటరన్న సలహాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.