‘అజ్ఞాతవాసి’ పరాజయం త్రివిక్రమ్ బ్రాండ్ వేల్యూని దెబ్బతీసింది. మాటల మాంత్రికుడి ఇమేజ్‌కి చాలా డ్యామేజ్ జరిగింది. అంతకుమించి డ్యామేజ్ చేశాడు ఫ్రెంచ్ దర్శకుడు జేరోమ్ సలే. ‘అజ్ఞాతవాసి’ విడుదలకు ముందు నుంచీ ఫ్రెంచ్ సినిమా ‘లార్గో వించ్’ స్ఫూర్తితో త్రివిక్రమ్ సినిమా తీస్తున్నాడని ప్రచారమైంది. విడుదల తరవాత సినిమా చూసిన జేరోమ్ సలే తన చిత్రానికీ, ‘అజ్ఞాతవాసి’కి చాలా సారూప్యతలు ఉన్నాయని ట్వీట్ చేశాడు. తనకు క్రెడిట్స్ ఇవ్వలేదని వాపోయాడు. ‘లార్గో వించ్’ ఇండియన్ లాంగ్వెజెస్ రీమేక్ రైట్స్ బాలీవుడ్ ప్రోడక్షన్ హౌస్ టీ–సిరీస్‌కి విక్రయించామనీ, త్రివిక్రమ్ రైట్స్ తీసుకున్నారో? లేదో? తెలియదనీ జేరోమ్ సలే పేర్కొన్నారు. అప్పట్లో టీ–సిరీస్‌కి హారిక అండ్ హాసిని సంస్థ రైట్స్ కోసం కొంత రుక్కం ఇచ్చారని వార్తలొచ్చాయి. తాజా ఇంటర్వ్యూలో ఈ వివాదంపై త్రివిక్రమ్ స్పందించారు. చిత్రం పరాజయం పాలైన కారణంగా చిత్రనిర్మాతకు తన పారితోషకాన్ని తిరిగి ఇచ్చానని, అంతే తప్ప ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు.
జేరోమ్ సలే ట్వీట్స్ చదివానని, అంతకు మించి ఏం చేయగలమని త్రివిక్రమ్ ప్రశ్నించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘నేను ఆయనకు డబ్బులు ఇవ్వలేదు. టీ–సిరీస్ వాళ్ళకూ డబ్బులు ఇవ్వలేదు. నా దగ్గరకు వచ్చి ఎవరూ మాట్లాడలేదు. ఒకవేళ నన్ను డబ్బులు అడిగితే కచ్చితంగా బాధపడుతూ ఇచ్చేవాణ్ణి. నా నిర్మాత లాస్ అయ్యారు కాబట్టి రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చా. అంతవరకూ నేను చేయగలిగా’’ అన్నారు. జేరోమ్ ట్వీట్స్‌పై మీ రియాక్షన్ ఏంటి?, పరువు పోయినట్టు లేదా? అని ప్రశ్నించగా… ‘‘ఉంటుంది. కాని ఏం చేయగలం? క్యారీ చేయాల్సిన విషయం ఏం ఉంది? డస్ట్‌బిన్‌ని రోజూ మెడలో కట్టుకుని తిరగడం దేనికి? ఫ్లవర్‌ని పెట్టుకుని తిరిగితే ఉపయోగం ఉంటుంది కానీ!!’’ అన్నారు.