బడ్జెట్ లో కేటాయింపులు లేని ఏవిధమైన ఆర్ధిక సహాయమూ ఆంధ్రప్రదేశ్ కు లభించదు. తెలుగుదేశం ఎంపి ఒకరు రాసిన లేఖకు కేంద్ర ఆర్ధిక శాఖ నుంచి వచ్చిన సమాధానం ఈ అంశాన్ని స్పష్టం చేసింది.
కొత్తగా రాబోయే పరిశ్రమలకు పన్ను మినహాయింపు మొదలైన రాయితీలు ఇవ్వాలని అభ్యర్ధిస్తూ రాసిన ఆ ఉత్తరానికి ఇచ్చిన సమాధానంలో ”విభజన చట్టం లో పొందు పరచిన రకరకాల అంశాలపై ప్రత్యేక, అదనపు ఆర్ధిక సహాయాలు ఇవ్వవలసి వస్తే అది నీతి ఆయోగ్ – నేషనల్ ఇన్ స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా సిఫారసులను బట్టి వుంటాయి. ఆసిఫారసులు కూడా బడ్జెట్ లోని వనరులను అనుసరించి వుంటాయి” అని ఆర్ధకశాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా స్పష్టం చేశారు.
చట్టంలో లేదుకాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు…ఇతర ప్రాంతాలు నష్టపోతాయి కాబట్టి రాయితీలు మినహాయింపులు ఇవ్వలేము…బడ్జెట్ కేటాయింపులు లేవు కాబట్టి ప్రత్యేక ఆర్ధిక సహాయాలు సాధ్యం కాదు…రెవిన్యూలోటు ఎంత అనేది అనుమానంగా వుంది కాబట్టి ఆలోటు ఇప్పటికిప్పుడే పూరించ లేమేమో…విభజన చట్టంలో పొందు పరచిన జాతీయ పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టు కాదనడం లేదు. నాబార్డునుంచి అప్పు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాము. మీరే తీర్చుకుందురుగాని..ప్రతీ ప్రశ్నకు ఇలాగే సమాధానాలు ఇస్తున్న బిజెపి ప్రభుత్వం సమాధానాలు ఇలాగే వున్నాయి. దీని అర్ధం ”మీ చావు మీరు చావండి” అనే తప్ప మరేమీ కాదు.
అంధ్రప్రదేశ్ ను అన్ని విధాలా ఆదుకుంటాం అనేసి ప్రతీ బిజెపి నాయకుడూ వెళ్ళిపోవడం ఒక విధమైన శాడిజమే! శాడిస్టులకు భవిష్యత్తూ వుండదు…బతుకూ వుండదు!