ఒకప్పుడు ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, తర్వాత జ్యోతి,భూమి,జనత వంటి పత్రికలన్నీ ఆంధ్ర శబ్దంతోనే వెలువడ్డాయి. కమ్యూనిస్టులు అంతకు ముందున్న ప్రజాశక్తి స్థానంలో విశాలాంధ్ర స్థాపించారు. తెలంగాణ ఉద్యమం వచ్చాక నమస్తే తెలంగాణ పత్రిక ప్రారంభమైంది. అల్లం నారాయణ సంపాదకుడుగా సిఎల్రాజం ఆధ్వర్యంలో కెసిఆర్ ఆశీస్సులతో ఆరంభమైన ఆ పత్రిక ఉద్యమాన్ని పూర్తిగా బలపరిచింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విశాలాంధ్ర రెసిడెంట్ ఎడిటర్‌గా వున్న కె.శ్రీనివాసరెడ్డి సంపాదక యాజమాన్యంలో మన తెలంగాణ అనే పత్రిక మొదలైంది. తర్వాత కొన్నాళ్లకు ప్రజాశక్తి స్థానే నవ తెలంగాణ ఎస్.వీరయ్య సంపాదకత్వంలో ఎక్కువ పేజీలతో రంగులతో ప్రారంభమైంది. ఇందులో మన తెలంగాణకు పరోక్షంగా ప్రభుత్వ వర్గాల సహకారం వుందనే అభిప్రాయం మీడియా సర్కిల్స్‌లో బలంగా వుంది.
ఈ మూడింటిలో నవతెలంగాణ ఎక్కువగా వామపక్ష దృక్పథం అందించడమే గాక క్షేత్రస్థాయి కథనాలను కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలను తప్పులను నిస్సంకోచంగా ప్రచురిస్తున్నది. టీవీ ఛానళ్లలోనూ అసెంబ్లీ లాబీల్లోనూ తరచూ చర్చకు వస్తున్నది. ఇది ప్రభుత్వానికి అంతగా మింగుడుపడటం లేదని సమాచారం. మరోవైపున ఆశించిన విధంగా మన తెలంగాణ పత్రిక అభివృద్ధి కావడం లేదని, ఈ మధ్యన సిబ్బందికి జీతాలు ఇవ్వడం కూడా సమస్యగా మారిందని వార్తలు వస్తున్నాయి. పైగా తెలంగాణలో ఇప్పటికీ ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పత్రికలే అధికంగా అమ్ముతుండడం తెలంగాణ ప్రధానమైన పత్రికలకు సమస్యగా వుందంటున్నారు.
ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడే మారే అవకాశాలూ లేవు. కనుక మన తెలంగాణ ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని మీడియా పరిశీలకులు అనుకుంటున్నారు. సిపిఐ నేపథ్యంలో మొదలైన 99 ఛానల్లాగే ఇది కూడా త్వరలోనే మూతపడితే తమ భవిష్యత్తు ఏమవుతుందని సిబ్బందిలో ఆందోళన వ్యక్తం అవుతున్నది. నవతెలంగాణకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాటి సమస్యలు లేకున్నా ప్రభుత్వం నిరాదరణ చూపుతుందన్న భావం వ్యక్తమవుతుంది.