ప్రైవేటీకరణ వల్ల రాష్ట్రాలకు కూడా ప్రయోజనం..శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది.. ఇదీ రాష్ట్రాలకు నీతి ఆయోగ్ నుంచి అందిన సందేశం. దీనికి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందించాయో కానీ.. ఏపీ మాత్రం చురుగ్గా స్పందించింది. దీంతో స్టీల్ ప్లాంట్ ఆందోళనలపై ఇక నుంచి ఉక్కుపాదం మోపడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. అసలు నీతి ఆయోగ్ చేసిన సూచనలు… ఒక్క శాంతిభద్రతల అంశం కాదు. ఇంకా చాలా ఉన్నాయి. అందులో రాష్ట్రంలోని ఇతర ఆస్తుల అమ్మకాలు కూడా ఉన్నాయి. ఇదేదో బాగుందనుకున్న రాష్ట్ర ప్రభుత్వం…నీతి ఆయోగ్ సూచనలు పక్కాగా పాటించాలని డిసైడ్ అయింది.
కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణను ఉద్యమంలా చేపట్టాలని నిర్ణయించుకుంది. అయితే కేంద్రానికి ప్రత్యేకంగా అస్థిత్వం లేదు. కేంద్ర సంస్థలైనా రాష్ట్రాల్లోనే ఉండాలి. రాష్ట్రాల సహకారం లేకపోతే… కేంద్ర సంస్థల్ని అమ్మడం సాధ్యం కాదు. అందుకే.. పెట్టుబడుల ఉపసంహరణలోకి ప్రణాళికా బద్దంగా రాష్ట్ర ప్రభుత్వాల్నీ భాగం చేస్తోంది. నిధుల కొరతతో అల్లాడే… ఏపీ లాంటి రాష్ట్రాలు… దీనికి సై అంటున్నాయి. నీతి ఆయోగ్ ప్రత్యేకంగా రాష్ట్రాల్లోనూ అమ్మాల్సిన సంస్థల గురించి ప్రత్యేకంగా కొన్ని సిఫార్సులు చేసింది. పెట్టుబడులు ఉపసంహరిస్తున్న చోట్ల అనేక చోట్ల నిరసనలు ఉద్ధృతమవుతున్న సమయంలో… శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా రాష్ట్రాలు చూసుకోవాలని స్పష్టమైన సందేశాన్ని రాష్ట్రాలకు పంపించింది. అదే సమయంలో రాష్ట్రాల్లోని నిరుపయోగ ఆస్తులు, నగదుగా మార్చేందుకు నేషనల్ డిమానిటైజేషన్ పైప్‌లైన్.. ఎన్ఎమ్పీసేవలు ఉపయోగిచుకోవాలని సూచించింది.
ప్రస్తుతం ఏపీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నీతి ఆయోగ్ సూచనలు సంచలనం సృష్టిస్తున్నాయి. శాంతిభద్రతలు అంటే ఉద్యమంపై ఉక్కుపాదం మోపడమే. రాష్ట్రానికి కూడా నిధులు అవసరం కావడం.. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్‌లో భాగం కావడానికి ఏపీ సర్కార్ వెంటనే.. నోడల్ ఏజెన్సీగా ఇన్‌క్యాప్‌ను నియమించింది. ఏపీలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టడానికి రంగం సిద్దం చేస్తోంది. ముందుగా నష్టాలు వస్తున్న సంస్థలను అమ్మేస్తారు. అందులో ఆర్టీసీ మొదట ఉంటుంది. మిగతా ఏయే సంస్థల్ని అమ్మేస్తారో త్వరలోతెలియనుంది. సీక్రెట్‌గా వ్యవహారాలు నడపడంలో ఏపీ సర్కార్‌కు సాటి లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో నిధుల కోసం ఇప్పటికే ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కూరగాయల మార్కెట్లు.. క్వార్టర్లను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఈ క్రమంలో కోర్టుకేసులు పడ్డాయి. ఇప్పుడు కేంద్రం నుంచి అమ్ముకునే విషయంలో మరో అవకాశం వచ్చి పడటంతో ఏపీ సర్కార్ వదులుకునే అవకాశాలు కనిపించడం లేదు.