ఆఖరి నిముషంలో అడిగారన్న కొరత పెట్టుకోకుండా రైల్వేమంత్రి సురేష్ ప్రభును రాజ్యసభకు పంపించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆశాభంగమే మిగిల్చింది బిజెపి నాయకత్వం. ప్రత్యేక హౌదా రాకపోయినా కనీసం విశాఖ రైల్వేజోన్ అయినా ఇప్పిస్తే కొంత పరువు కాపాడుకోవచ్చన్న అంచనాలు తలకిందులు చేసింది. రైల్వే బడ్జెట్ సమయంలో మాతో చర్చించిన బిజెపి నేతలు చాలామంది జోన్ తర్వాత తప్పక వస్తుందని వాదించారు. కాని ఇప్పుడు సురేష్ ప్రభు స్వయంగా ఆ అవకాశం లేదని చెప్పేశారు. ఇతర కోర్కెలను నెరవేరుస్తామన్నారు. కృతజ్ఞతా ప్రకటన సమయంలోనే కుండబద్దలుకొట్టి చెప్పారంటే ఆశలు వదులుకోవలసిందేనని తేలిపోయింది. ఒరిస్తా అభ్యంతరం చెబుతున్నదనే సాకు కూడా వినిపించారు. ప్రత్యేక హౌదా విషయంలో వలెనే దీనిపైన కూడా గత ప్రభుత్వం పరిశీలించాలని చెప్పిందే తప్ప నిర్ణయం తీసుకోలేదని మెలికపెట్టారు. మాకు జోన్ ముఖ్యం అని చంద్రబాబు అన్నమాట లాంఛనమే తప్ప ప్రబావశీలం కాదని ఆయనకూ తెలుసు.
గోరుచుట్టమీద రోకటిపోటులా ఇదే సమయంలో ఆర్థిక సహాయానికి సంబంధించి కూడా కేంద్రం నుంచి వచ్చిన సంకేతాలు ప్రతికూలంగా వున్నాయి. రెవెన్యూలోటు 16 వేల కోట్లు అన్న సిఎజి లెక్కను అవతలపెట్టేసి ఆరువేల కోట్లకే పరిమితమైంది. రైతు రుణమాఫీ తమకు సంబంధం లేని కొత్త పథకమని తేల్చిపారేసింది. రాజధానికి కూడా ఇప్పటికి ఇచ్చిన రెండువేల కోట్ల పైచిలుకు తప్ప మరింత మంజూరు చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది.
సో.. చంద్రబాబు సన్నాయి నొక్కులు సర్దుబాటు రాగాలు కేంద్రం ముందు పనిచేయడం లేదని తేలిపోయింది. అయినా ఇప్పుడున్న రాజకీయ సమీకరణలు మారవని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి వారికి రాజకీయంగా పచ్చజెండా వూపేశారు.