ఒకప్పుడు ఈనాడు మీడియా తెదేపాకి అనధికార వార్తా సంస్థగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దాని స్థానాన్ని ఇప్పుడు ఆంధ్రజ్యోతి మీడియా తీసుకొన్నట్లు అందరూ నమ్ముతున్నారు. కనుక ఆ మీడియాలో తెదేపా, రాష్ట్ర ప్రభుత్వం గురించి వచ్చే వార్తలని అధికారిక వార్తలుగానే పరిగణించవచ్చు.
ఇవ్వాళ్ళ ఆ పత్రికలో అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇంక నిధులు ఇవ్వబోనని తేల్చి చెప్పిందని ఒక వార్త ప్రచురించింది. ఇదివరకు ఇచ్చిన రూ.2,050 కోట్లతోనే రాజధాని భవనాలను నిర్మించుకోమని సూచించినట్లు చెప్పింది. అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్రాలో వెనుకబడిన ఏడు జిల్లాల అభివృద్ధి కోసం ఒక్కో జిల్లాకి ఇంతవరకు ఇస్తున్నట్లుగానే ఏడాదికి రూ.50 కోట్లు చొప్పున రూ.350 కోట్లు మాత్రమే ఇస్తామని, అంతకంటే ఒక్క పైసా కూడా అదనంగా ఇవ్వబోమని కేంద్ర ఆర్ధికశాఖ తేల్చి చెప్పిందని పేర్కొంది.
గత ఏడాది రూ. 16,078.76 కోట్లు రెవెన్యూ లోటు ఉందని చెప్పిన కాగ్, తాజాగా సమర్పించిన నివేదికలో రూ.6,803 కోట్లు లోటు మాత్రమే ఉందని పేర్కొందిట! రెవెన్యూ లోటు భర్తీ క్రింద కేంద్ర ప్రభుత్వం రూ.2,803 కోట్లు ఇచ్చింది కనుక మిగిలిన రూ.4,000 కోట్లు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ పత్రిక పేర్కొంది.
ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి అంతకంటే చాలా ఎక్కువ సబ్సిడీలు, పన్ను రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెప్పింది. కానీ ఇప్పుడు అది కూడా ఈయలేమని చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొంది. ఎలాగూ త్వరలో దేశ వ్యాప్తంగా ఏకీకృత పన్నువిధానం అమలుచేయడానికి జి.ఎస్.టి.బిల్లుని పార్లమెంటులో ఆమోదించబోతున్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా పన్ను రాయితీలను ఇవ్వనవసరం లేదని కేంద్రం చెప్పినట్లు ఆంధ్రజ్యోతి పేర్కొంది.
ఇప్పటికే నిధులులేక పోలవరం నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. రాజధాని నిర్మాణ పనులు మొదలుపెట్టనే లేదు. ఒకవేళ కేంద్రం ఇక రాష్ట్రానికి నిధులు విడుదల చేయకపోతే అభివృద్ధి పనులన్నీ కాగితాలకే పరిమితం అవుతాయి. తెదేపా, భాజపా సంబంధాలు మళ్ళీ దెబ్బతింటాయి. ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్పినందుకే రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నిధులు కూడా ఇవ్వబోమని చెపితే ప్రజలను రెచ్చగొట్టినట్లే అవుతుంది. దాని వలన మొదట భాజపాకే నష్టం జరుగుతుంది. ఆ తరువాత తెదేపా కూడా నష్టపోవలసి రావచ్చు.
ఈ సమస్యకి మూలకారణం రాష్ట్ర ప్రభుత్వం నిధులను దుబారా చేయడం, వేరే అవసరాలకు మళ్ళించడం, ఖర్చులకి సరిగ్గా లెక్కలు అప్పజెప్పకపోవడమే కారణమని పురందేశ్వరి వంటి భాజపా నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం నేటి వరకు అనేక పనులపై తెదేపా ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రజాధనం వృధాఖర్చులు చేస్తోందని ప్రతిపక్షాలు, మిత్రపక్షమైన భాజపా నేతలు కూడా విమర్శిస్తున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం తగ్గడం లేదు పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటిని గట్టిగా సమర్ధించుకొంటున్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాల, ప్రజల అభిప్రాయలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినప్పటికీ, కనీసం భాజపా నేతల విమర్శలనైనా పట్టించుకొని అది ఎత్తిచూపుతున్న తప్పులను సవరించుకొనే ప్రయత్నాలు చేసి ఉండాల్సింది కానీ తెదేపా నేతలు భాజపా నేతల విమర్శలని తిప్పికొట్టడానికి, వీలయితే ఎదురుదాడి చేయడానికే ప్రయత్నించారు. బహుశః అందుకే కేంద్రం కూడా నిధులు ఇవ్వబోమని మొండికేసిందని భావించవలసి ఉంటుంది. ఇప్పుడు దీనిపై రెండు పార్టీల మధ్య యుద్ధం మొదలవుతుందేమో.