తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లోపు బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుందని ఆ పార్టీలో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఉండరని ప్రకటనలు చేశారు. కానీ స్కోర్ కార్డు పది దగ్గరే ఆగిపోయింది. ఇప్పుడల్లా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే చేరరని క్లారిటీ వచ్చేసింది.
ఎమ్మెల్యేలు పార్టీని వీడి పోకుండా చేసుకోవడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది. ఎమ్మెల్యేలకు నచ్చ చెప్పడంలో కేసీఆర్ తనదైన మార్క్ చూపించారు. వచ్చే కొద్ది నెలల్లో తెలంగాణ రాజకీయాలు మారిపోతాయని ఓపిక పట్టాలని పార్టీ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పెద్దలు సర్ది చెబుతున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో జరుగుతున్న చర్చల గురించి బీఆర్ఎస్ పెద్దలు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. కొద్ది నెలల్లో ప్రభుత్వాన్ని మార్చేద్దామన్న నమ్మకం కలిగేలా పార్టీ ఎమ్మెల్యేలకు సర్ది చెప్పారు.
బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం లేదా పొత్తుల గురించి ఎంతగా ప్రచారం జరిగుతున్నా మౌనం అర్థాంగీకారం అన్నట్లుగా రెండు పార్టీల నేతలు ఉంటున్నారు. అసలు అలాంటిదేమీ లేకపోతే మరో మాట లేకుండా ఖండించేవారు. అలాంటి ఖండన ప్రకటనలు రాకపోవడంతో నిజంగానే చర్చలు జరుగుతున్నాయన్న నమ్మకంతో ఎమ్మెల్యేలు ఉన్నారు. రేపు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత.. ఇలాంటి పరిస్థితి వస్తే.. ఇబ్బంది పడతామని జరిగే పరిణామాలను బట్టి వేచి చూడాలని అనుకుంటున్నారు. ఈ కారణంగా చేరికలు కాంగ్రెస్ అనుకున్నంత జోరుగా సాగలేదని అనుకోవచ్చు. రెండు పార్టీల మధ్య ఏమీ ఉండదని అనుకుంటే.. అప్పుడు మరోసారి కాంగ్రెస్ ఆకర్ష్ ప్రయోగించే అవకాశం ఉంది.