స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ సర్కార్ పంతం నెగ్గలేదు. సాధ్యం కాదని తెలిసినా 59.85 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేదుకు జారీ చేసిన జీవోను.. హైకోర్టు కొట్టి వేసింది. నిబంధనల ప్రకారం… 50 శాతంలోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా.. మొదట్లో 59 శాతం వరకూ రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలనుకున్నా.. కోర్టులు అంగీకరించలేదు. దాంతో.. 50 శాతం లోపే రిజర్వేషన్లు ఖరారు చేసి.. ఎన్నికలు నిర్వహించింది. ఈ అనుభవం కళ్ల ఎదురుగా కనబడుతున్నప్పటికీ.. ఏపీ సర్కార్.. మళ్లీ 59.85 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికల నిర్వహిస్తామంటూ జీవో జారీ చేసింది.
వైసీపీతో సన్నిహితంగా ఉండే… ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. రిజర్వేషన్ల అంశాన్ని తేల్చాలని హైకోర్టుకు సూచించింది. దీంతో విచారణ జరిపిన హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు ప్రకటించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం… 50శాతంలోపే ఉండాలని స్పష్టం చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తాము ఎక్కువ రిజర్వేషన్లు కల్పించాలనుకున్నామని కానీ.. ప్రతిపక్ష పార్టీల నేతలు కోర్టుకెళ్లి వారికి అన్యాయం చేశారని.. ప్రచారం చేయడానికి అధికార పార్టీలు సహజంగా.. ఈ వ్యూహాన్ని అమలు చేస్తాయి ఏపీలోనూ అధికార పార్టీ అదే చేసింది. అయితే.. ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన లేదనే అభిప్రాయం కూడా.. రాజకీయవర్గాల్లో ఉంది.
హైకోర్టు తీర్పు ఇలా వస్తుందని ప్రభుత్వం ముందుగానే ఊహించిందేమో కానీ.. ఇతర పార్టీలపై ఆరోపణలను మంత్రులు ప్రారంభించారు. టీడీపీ నేతలే రిజర్వేషన్లపై హైకోర్టుకెళ్లారనే విమర్శలు ప్రారంభించారు. దీనికి టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఏపీ సర్కార్ వెంటనే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని.. బీసీల రిజర్వేషన్లు తగ్గిస్తే.. సహించబోమని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నా రు. దీంతో ఇప్పుడు.. ఇక … స్థానిక ఎన్నికల రాజకీయం ప్రారంభమైనట్లే భావించాలి.