రాష్ట్ర విభజన తరువాత పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని నగరంగా హైదరాబాద్ ఉంటుంది. ఈ అవకాశం ఉన్నా సరే, పాలనా యంత్రాన్ని ఏపీకి ఎప్పుడో తీసుకుని వెళ్లారు సీఎం చంద్రబాబు. అమరావతిలో అరకొర సౌకర్యాలే ఉన్నా, ఉద్యోగులకు సరైన వసతుల లేవన్న విమర్శలు వినిపిస్తున్నా.. అంతా అక్కడి నుంచే నడిపిస్తున్నారు. నిజానికి, హైదరాబాద్ లో ఉంటూనే అమరావతి నిర్మాణాన్ని సమీక్షించుకోవచ్చు. కానీ, రకరకాల కారణాల వల్ల ఏపీకి వెళ్లారు. హైదరాబాద్ లోని సచివాలయాన్ని కూడా ఖాళీ చేశారు. ఇక్కడున్న భవనాలపై ఉన్న హక్కుల్ని కూడా వదిలేసుకున్నారు. అయితే… కొంతమంది అధికారులు మాత్రం ఇప్పటికీ హైదరాబాద్ చుట్టూనే చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
వివిధ పనులూ సమావేశాల పేరుతో భాగ్యనగరంలో ఎక్కువ సమయం ఉండేందుకు ట్రై చేస్తున్నారు. ఇలాంటి వారికి ఏపీ సర్కారు చెక్ పెడుతోందని చెప్పాలి. ఇకపై హైదరాబాద్ లో ఎలాంటి సమావేశాల నిర్వహించకూడదు అంటూ ఏపీ కొత్త సీఎస్ దినేష్ కుమార్ ఒక సర్క్యులర్ విడుదల చేశారు. సలహాదారులైనా, కన్సెల్టెంట్లు అయినా హైదరాబాద్ లో సమావేశాలు నిర్వహించకూడదనీ, అంతా ఏపీలోనే జరగాలని ఆయన స్పష్టం చేశారు. ఏపీకి సంబంధించిన అన్ని కార్యాలయాలూ హైదరాబాద్ నుంచి వెలగపూడికి వచ్చేశాయనీ, కాబట్టి ఇకపై ఏ కీలక ప్రభుత్వ సమావేశమైనా ఏపీలోనే జరిగాల్సిందే అని ఆదేశించారు.
నిజానికి, కొంతమంది ఉన్నతాధికారులు ఇప్పటికీ హైదరాబాద్ లోనే సమావేశాలు పెడుతున్నారంటూ విమర్శలున్నాయి. సచివాలయం వెలగపూడిలో ఉంటే, హైదరాబాద్ లో మీటింగులు అంటూ వెళ్లిపోతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ సర్యులర్ తో వాటికి చెక్ పెట్టినట్టే. దీంతోపాటు మరో ఆదేశం కూడా జారీ చేశారండోయ్. వెలగపూడి సచివాలయ ఉద్యోగులు సరైన టైమ్ కి విధులకు రావడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. వచ్చే నెల నుంచి బయోమెట్రిక్ మెషీన్లు పెట్టి, వాటి ద్వారా హాజరు నమోదు చేసేందుకు కూడా దినేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఓ రకంగా ఈ చర్యలు మంచివే. ఉద్యోగుల్లో క్రమశిక్షణ పెంచుతాయి.
హైదరాబాద్ లో సమావేశాలు వద్దు అని చెప్పడం ఓకేగానీ, ఉన్నతస్థాయిలో సమావేశాలు నిర్వహించుకునే వసతులు ఏపీ రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్నాయా లేదా అనేది కూడా ఆలోచించాలి. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుంది.