గ్రేటర్ హైదరాబాద్లో కొంతకాలంగా బడా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం లేదు. మామూలు భవనాలకు అనుముతలపై సమస్యలు లేనప్పటికీ మల్టీ స్టోరైడ్ బిల్డింగ్లకు అనుమతి మాత్రం రావడం లేదు. ఇందు కోసం ప్రత్యేకంగా అనుమతుల ప్రక్రియ ఉంటుంది. మల్టీ స్టోరైడ్ బిల్డింగ్ కమిటీ సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వారాలు గడుస్తున్నా ఇలాంటి సమావేశాలను నిర్వహించడం లేదు. పేరుకుపోతున్న దరాఖాస్తులను క్లియర్ చేయాలని విజ్ఞప్తులు వస్తున్నా అధికారులు మాత్రం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారు.
గ్రేటర్ తోపాటు హెచ్ఎండీఏ పరిధిలో పద్దెనిమిది మీటర్లు ఎత్తు కన్నా ఎక్కువ నిర్మించాలంటే ఎంఎస్బీ అనుమతి తప్పని సరి. ఈ అనుమతుల్లో జాప్యం కావడంతో అనేక ప్రాజెక్టులు ఇంకా పేపర్ల మీదనే ఉన్నాయి. ప్రాజెక్టులో.. ప్లాన్లో ఏదైనా లోపం ఉంటే అదైనా చెప్పవచ్చు కానీ ఏమీ చెప్పకుండా పెండింగ్లో ఉంచుతున్నారు. దీనికి కారణం ప్రభుత్వం వైఖరే. దగ్గర్లో నారా లేదా చెరువు ఉంటే… జలవనరుల శాఖ నుంచి ఎన్వోసీ తెచ్చుకోవాలని అంటున్నారు. దగ్గర్లో నాలా , చెరువు లేని కాలనీలు. ఏరియాలు హైదరాబాద్లో ఉంటాయా ?
ఎన్నికలకు ముందు గ్రేటర్ చుట్టూ నిర్మిస్తున్న హైరైజ్ అపార్టుమెంట్ల విషయంలో సీఎం రేవంత్ వ్యతిరేకత వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరం విస్తరణకు ఎంతో అవకాశం ఉన్నా ప్లేస్ లేనట్లుగా అక్కడిక్కడే భారీ ఎత్తున అపార్టుమెంట్లు నిర్మించడం సరి కాదని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన అభిప్రాయం ప్రకారం… అనుమతులు కూడా ఆలస్యం చేస్తున్నారని అనుకోవచ్చు. ఈ లెక్కన చూస్తే.. ఐటీ కారిడార్ చుట్టూ కాకుండా.. నగరం చుట్టుపక్కల విస్తరణ కోసం ఇలాంటి ప్రాజెక్టుల అనుమతిని స్వల్పం చేసే అవకాశాలు ఉన్నాయి